NTV Telugu Site icon

CM Chandrababu: ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగుజాతి తయారవ్వాలి..

Chandrababu

Chandrababu

CM Chandrababu: దేశంలో నాల్గవ భాష తెలుగు, పదికోట్ల మంది మాట్లాడే భాష తెలుగు.. అమెరికాలో తెలుగు 11వ భాష.. అదీ తెలుగువారి సత్తా.. అంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగు గొప్పదనం గురించి కొనియాడారు. తెలుగు భాషా దినోత్సవం వేడుకల్లో పాల్గొని ఆయన ప్రసంగించారు. ఇంగ్లీషు పిచ్చకు కారణం మనందరకూ తెలిసిందేనని.. మాతృభాషలోనే జ్ఞానం వస్తుందన్నారు. ప్రపంచంలోనే అగ్రజాతిగా తెలుగుజాతి తయారవ్వాలన్నారు. విదేశాల్లో ఉండే తెలుగు వారికి మన సంస్కృతి, నాగరికత అంటే అభిమానమని.. ఇక్కడి వారు కూచిపూడి మర్చిపోయినా… అమెరికాలో కూచిపూడి మర్చిపోలేదన్నారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన వారు పొట్టి శ్రీరాములు అని, తెలుగు భాషకోసం పోరాడిన వారు గిడుగు రామమూర్తి, తెలుగు జాతి ఖ్యాతి ప్రపంచం మొత్తం చాటి చెప్పిన వారు నందమూరి తారకరామారావు అని చంద్రబాబు పేర్కొన్నారు. భాషను ప్రొమోట్ చేయడంలో ఎన్టీఆర్ ముందున్నారన్నారు.

Read Also: Minister Narayana: అమరావతిలో రూ.160 కోట్లతో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం

ప్రాచీన విశిష్ట తెలుగు అధ్యయన కేంద్రం నెల్లూరు జిల్లా వెంకటాచలంకు మార్పించాలని చూశామని సీఎం చెప్పారు. ఐదేళ్ళ పాటు వచ్చిన గత ప్రభుత్వం ఇంగ్లీషు తప్పనిసరి అని చెప్పిందన్నారు. సుమతి శతకాలు, వేమన శతకాలు చదివి నీతిని నేర్చుకునే వాళ్ళమన్నారు. జీతం కోసం ఇంగ్లీషు, జీవితం కోసం తెలుగు నేర్పిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్‌గా విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తున్నామన్నారు. 2047 నాటికి భారతదేశం ప్రపంచంలోనే ఒకటవ స్థానంలో ఉంటుందన్నారు.2047 నాటికి ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో ప్రధమ స్ధానంలో ఉంటుందన్నారు. అమరావతి రాజదాని కూడా రాబోయే తరాలు గర్వపడేలా ఉంటుందన్నారు. జీఓ నం.77 వల్ల వచ్చే ఇబ్బందులు లేకుండా చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. సూర్య రాయేంద్ర నిఘంటువు పునర్ముద్రణకు హామీ ఇస్తున్నామన్నారు. ఐదేళ్ళలో గడచిన ప్రభుత్వం కళాకారులకు కూడా పని చేయించుకుని డబ్బులు ఇవ్వలేదు.. అదంతా త్వరలోనే మేం చెల్లిస్తామని సీఎం తెలిపారు. ఏపీలో కూడా ఒక ఎంఓయూ చేసి మన కళాకారులను ప్రపంచం మొత్తం పంపేలా చూస్తామన్నారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా కేంద్రం మన రాష్ట్రంలో పెడతామని సీఎం స్పష్టం చేశారు. సంగీత నాటక అకాడమీని మన రాష్ట్రంలో పెడతామని.. కూచిపూడి నృత్యానికి ప్రత్యేక స్థానం కల్పిస్తామన్నారు. ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Show comments