CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. కరువు, తుఫాన్ల బాధిత రైతులకు రూ.2,459 కోట్ల పరిహారం..

Cm Chandrababu Teleconference Arnab

Cm Chandrababu Teleconference Arnab

కరువు, తుఫాన్ల కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకునే విషయంలో ఏమాత్రం జాప్యం చేయొద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విపత్తుల నష్టం, రైతులకు అందించాల్సిన పరిహారంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రకృతి వైపరీత్యాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాతలకు తక్షణమే ఆర్థిక భరోసా కల్పించాలని, అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నేరుగా ఇన్‌పుట్ సబ్సిడీని జమ చేయాలని స్పష్టం చేశారు. ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పంటల బీమా పరిహారం కూడా రైతులకు సకాలంలో అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రంలో కరువు, తుఫాన్ల వల్ల జరిగిన నష్టానికి సంబంధించి మొత్తం రూ.2,459 కోట్ల పరిహార ప్రతిపాదనలను అధికారులు సీఎం ముందుంచారు. ఇందులో ఎల్‌నినో కరువు నష్టానికి రూ.1,721 కోట్లు, అర్నబ్ తుఫాను నష్టానికి రూ.602 కోట్లు, మురసు తుఫాను నష్టానికి రూ.97 కోట్ల చొప్పున ప్రతిపాదనలు రూపొందించారు. వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్ధక రంగాల్లో జరిగిన నష్టాన్ని పూర్తిస్థాయిలో అంచనా వేసి బాధితులకు న్యాయం చేయాలని సీఎం సూచించారు. విపత్తు నిర్వహణ (డిజాస్టర్ మేనేజ్‌మెంట్) , ఎస్డీఆర్ఎఫ్ (SDRF) నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకుని రైతులకు అండగా నిలవాలని అన్నారు. అంతేకాకుండా.. రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అదనపు విపత్తు నిధులను త్వరగా సాధించేందుకు కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఉద్యాన పంటలతో పాటు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ‘జీ రామ్ జీ’ నిధులను వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. ప్రకృతి సేద్యానికి ఈ నిధుల వినియోగంపై అవసరమైన అనుమతులను తక్షణమే పొందాలని అధికారులకు స్పష్టం చేశారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా రెండూ అందేలా సమన్వయంతో పనిచేస్తూ, అన్నదాతల కష్టాలను తీర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.