CM Chandrababu: దేవాదాయ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో దేవదాయ శాఖపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కమిటీ వేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలని.. దేవాలయాల్లో అపచారాలకు చోటు ఉండకూడదన్నారు. బలవంతపు మత మార్పిడులు, అన్య మతస్థులు రాకూడదన్నారు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి అవకాశం కల్పిస్తామన్నారు.
Read Also: Andhra Pradesh: బీజేపీలో నామినేటెడ్ పదవులపై చర్చ.. ప్రతిపాదనలో వారి పేర్లు!
రూ. 10 వేలు వేతనం వచ్చే అర్చకులకు ఇకపై రూ. 15 వేలు వేతనంగా చెల్లిస్తామని సీఎం తెలిపారు. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంపు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగ వేద విద్యార్ధులకు నెలకు రూ. 3 వేలు భృతి ఇస్తామని ప్రకటించారు. నాయీ బ్రాహ్మణులకు కనీసం వేతనం రూ. 25 వేలు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. సీజీఎఫ్ కింద, శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా జరిగే పనుల్లో ప్రారంభం కాని పనులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు చేపడతామన్నారు. సింహాచలం పంచగ్రామాల సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
