NTV Telugu Site icon

AP CEO MK Meena: స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా ప్రమాణాలు పాటించాలి..

Ap Ceo

Ap Ceo

AP CEO MK Meena: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా రెండు రోజుల ఉత్తరాంధ్ర పర్యటన కొనసాగుతోంది. విశాఖ ఆంధ్రా యూనివర్శిటీలో ఈవీఎంలు భ‌ద్రప‌రిచిన స్ట్రాంగ్ రూమ్‌లను జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అన్ని రకాల భ‌ద్రతా ప్రమాణాలు పాటించాల‌ని, ప‌టిష్ట చ‌ర్యలు చేప‌ట్టాల‌ని ఆదేశించారు. అనుక్షణం అప్రమ‌త్తంగా ఉండాల‌ని, ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా జాగ్రత్త వ‌హించాల‌ని జిల్లా అధికారుల‌కు మీనా సూచించారు. విశాఖ‌ప‌ట్టణం పార్లమెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజక‌వర్గాల‌కు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌ల‌ను త‌నిఖీ చేశారు. అక్క‌డ ప‌రిస్థితులను గ‌మ‌నించారు. త‌లుపుల‌కు వేసిన తాళాల‌ను, వాటికున్న సీళ్లను సునిశితంగా ప‌రిశీలించారు.

Read Also: AP Violence: డీజీపీతో సిట్ సారథి వినీత్ బ్రిజ్‌ లాల్ భేటీ

అన్ని చోట్లా సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అన్ని ర‌కాల జాగ్రత్తలు తీసుకున్నారా లేదా అనే అంశాల‌ను అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. త‌నిఖీ అనంత‌రం లాగ్ బుక్‌లో సంత‌కం చేశారు. మూడెంచ‌ల భ‌ద్రత‌ను పాటించాల‌ని, ఇక్కడి ప‌రిస్థితుల‌ను నిరంత‌రం ప‌ర్యవేక్షించాల‌ని క‌లెక్టర్‌కు సూచించారు. అన‌ధికార వ్యక్తుల‌ను స్ట్రాంగ్ రూమ్‌లు ఉన్న ప్రాంతంలోకి ఎట్టిప‌రిస్థితుల్లోనూ అనుమ‌తించ‌రాద‌ని చెప్పారు. ఎల‌క్షన్ క‌మిష‌న్ నిబంధ‌న‌ల ప్రకారం అన్ని ర‌కాల జాగ్రత్తలు వ‌హించాల‌న్నారు. ప‌ర్యట‌న‌లో భాగంగా అక్కడి ప‌రిస్థితుల‌ను, జిల్లా యంత్రాంగం త‌ర‌ఫున చేపట్టిన చ‌ర్యలను సీఈవోకు క‌లెక్టర్, పోలీసు క‌మిష‌న‌ర్ వివ‌రించారు. విశాఖ నుంచి ఎన్నికల అధికారి శ్రీకాకుళం వెళ్ళారు. రేపు విజయనగరం జిల్లాల్లో పర్యటిస్తారు.