NTV Telugu Site icon

Daggubati Purandeswari: వారి తాటాకు చప్పుళ్లకు బెదరం.. వార్నింగ్‌ ఇచ్చిన పురంధేశ్వరి

Purandeswari

Purandeswari

Daggubati Purandeswari: వ్యక్తిగత దూషణలకు దిగినా.. బీజేపీ వారి తాటాకు చప్పుళ్లకు బెదరదు అంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు వార్నింగ్‌ ఇచ్చారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. ప్రకాశం జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆమె.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుంది అన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోడీకి స్పష్టత ఉందన్న ఆమె.. తొమ్మిదిన్నరేళ్ళలో అనినీతిరహిత పాలన చేసిన మోడీ.. దేశంలో సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారు.. దేవుడి విగ్రహాల నుంచి, గర్బ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారు.. మోడీ అన్నీ కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే.. సీఎం జగన్ సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు.. సామాజిక, సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు ఉందా..? అని నిలదీశారు.

Read Also: Kishan Reddy: బీజేపీ అధికారంలోకి రాక పోతే.. కిషన్‌ రెడ్డి ఏమన్నారంటే..

రాష్ట్రంలో విపక్షాలపై జరుగుతున్న దాడులు అందరికీ తెలుసు.. ఎస్సీ, బీసీలకు న్యాయం చేసే పరిస్థితి లేదు అన్నారు పురంధేశ్వరి.. రాష్ట్రంలో శాంతి భద్రతలు సక్రమంగా అమలు కాకుండా హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేస్తుంది.. కరువు మండలాలపై సీఎం జగన్ శీతకన్ను వేశారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులను అన్యాయం చేస్తున్న వైసీపీ ప్రభుత్వం.. కరువు ప్రాంతాల్లో బీజేపీ ప్రతినిధులు తిరిగి అధ్యయనం చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్తుందన్నారు. ఇక, టీటీడీలో అన్యమతస్తులను చైర్మన్లుగా నియమిస్తున్నారు.. టీటీడీ హుండీ మీద వచ్చిన ఒక శాతం ఆదాయాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మున్సిపల్ శాఖ మీద వచ్చే ఆదాయాన్ని ఎందుకు దారి మళ్లించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని నిలదీశారు. రాష్ట్రంలో అవినీతి పెట్రేగి పోయి పరాకాష్టకు చేరింది.. గ్రామీణ అభివృద్ధికి తిలోదకాలు ఇచ్చారని దుయ్యబట్టారు. సర్పంచ్ లకు ప్రభుత్వం చేసిన అన్యాయాలను తట్టుకోలేక ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడ్డారన్న ఆమె.. వ్యక్తిగత దూషణలకు దిగినా బీజేపీ వారి తాటాకు చప్పుళ్లకు బెదరదు.. ఏపీ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.

Show comments