AP Assembly Session: ఇవాళ్టి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు ఉదయం 9.46 నిమిషాలకు ఏపీ శాసన సభ ప్రారంభం కానుంది. రెండు రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత తొలిసారి శాసనసభ సమావేశాలు జరగనున్నాయి. రెండు రోజుల పాటు జరిగే సభా కార్యక్రమాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఉండనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. ప్రొటెం స్పీకర్‌గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. సభ్యులతో ప్రమాణం చేయించనున్నారు. గురువారం రాజ్‌భవన్‌లో ప్రొటెం స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రమాణం చేసిన విషయం విదితమే కాగా.. ఇక, నేడు సభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం, మంత్రులు.. ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయనున్నారు. మరోవైపు.. సాధారణ సభ్యుడిగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణం చేయనున్నారు. ప్రతిపక్ష హోదా లేకపోవడంతో సాధారణ సభ్యుడిగానే జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Read Also: Vivo Y58 5G Price: ‘వివో’ కొత్త స్మార్ట్‌ఫోన్.. 50MP కెమెరా, 6000mAh బ్యాటరీ! ధర కూడా తక్కువే
మరోవైపు.. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు విజిటింగ్ పాసులు రద్దు చేశారు. ఈ విషయాన్ని ఏపీ శాసనసభ అధికారులు వెల్లడించారు. అసెంబ్లీలో స్థలాభావం కారణంగా విజిటింగ్ పాసులు రద్దు చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు కూడా విజిటింగ్ పాసులు ఇవ్వట్లేదని వెల్లడించారు. విజిటింగ్ పాసులు రద్దు చేయడంతో ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు కూడా అసెంబ్లీలోకి వెళ్లే అవకాశం ఉండదు. తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన తమవారు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ప్రత్యక్షంగా చూసే అవకాశం వారి కుటుంబసభ్యులకు ఉండదన్నమాట.. అయితే, ప్రత్యక్ష ప్రసారాలు చూసుకునే అవకాశం ఉంటుంది.