NTV Telugu Site icon

AP Assembly Budget Sessions: ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా.. గత సీఎం కన్నెత్తి కూడా చూడలేదు: మంత్రి నిమ్మల

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

వైసీపీ పాలనలో కాలువలు, డ్రెయిన్స్‌లో తట్ట మట్టి కూడా తీయలేదని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. గత పాలనలో లాకులు, షట్టర్లు, డోర్స్ మరమ్మతులు మాట అటుంచి.. గ్రీజు వంటి మెయింటనేన్స్ కూడా చేయలేదని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ సరిగా చేయలేదని, ప్రాజెక్టుల గేట్లు కొట్టుకుపోయినా గత సీఎం కన్నెత్తి కూడా చూడలేదని విమర్శించారు. ప్రాజెక్టు పనుల నిమిత్తం సీఎం చంద్రబాబు రూ.380 కోట్లు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించుకున్నా.. అత్యవసర పనుల కోసం నిధులు ఇచ్చారని మంత్రి నిమ్మల చెప్పారు.

శాసనసభలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ… ‘గత 5 సంవత్సరాల పాలనలో కాలువలు, డ్రెయిన్స్‌లో ఒక్క తట్ట మట్టి తీయలేదు. గత పాలనలో లాకులు, షట్టర్లు, డోర్స్ మరమ్మతులు మాట అటుంచి.. గ్రీజు వంటి మెయింటనేన్స్ కూడా చేయలేదు. గుండ్లకమ్మ, పులిచింతల గేట్లు, అన్నమయ్య డ్యాం కొట్టుకు పోయినా.. నాటి ముఖ్యమంత్రి కన్నెత్తి చూడలేదు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా చంద్రబాబు అత్యవసర పనుల నిమిత్తం రూ.380 కోట్లు నిధులు, మరమ్మతుల నిమిత్తం ఇచ్చారు. సరైన నిర్వహణ లేక గత ఐదేళ్లు గోదావరి డెల్టా కాలువల నిర్మాణం విధ్వంసానికి గురైంది. కాంట్రాక్టర్లు పనుల్లో నిర్లక్ష్యం చేస్తే సంబంధిత ఏజెన్సీతో పాటు అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. కాటన్ బ్యారేజి గేట్లు రిపేర్లు డ్రిప్-2 కింద రూ.146 కోట్లు ప్రతిపాదించి ఆర్థిక శాఖకు పంపించడం జరిగింది. ఆఖరి ఎకరం వరకు సాగు నీరు అందించేందుకు రైతుల భాగస్వామ్యంతో సాగునీటి సంఘాలను తీసుకొచ్చాం’ అని అన్నారు.