Anshul Kamboj: అతని బౌలింగ్ నిజంగా అద్భుతం.. అరుదైన క్లబ్‌లో చోటు..!

  • తొలి వన్డేలో అన్‌షుల్ కాంబోజ్ 22 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు
  • కాంబోజ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
  • వన్డే కెరీర్‌లో రెండో మ్యాచ్‌లోనే అవార్డు..
Anshul Kamboj

Anshul Kamboj

Anshul Kamboj: న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్న భారత యువ పేసర్ అన్‌షుల్ కాంబోజ్ (Anshul Kamboj) అరుదైన ఘనత సాధించాడు. కేవలం 22 పరుగులే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టిన అతడు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును అందుకున్నాడు. ఈ క్రమంలో జస్ప్రీత్ బుమ్రా ఉన్న ప్రత్యేక జాబితాలో చోటు సంపాదించాడు.

కెప్టెన్ ప్రశంసలు

కాంబోజ్ బౌలింగ్‌పై భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. న్యూజిలాండ్ పరిస్థితులు అతడి బౌలింగ్‌కు ఎంతో అనుకూలమని పేర్కొన్నాడు. కాంబోజ్ ఎప్పుడూ వేగంగా బంతులు వేస్తూ, స్వింగ్‌తో పాటు సీమ్ కదలికను రాబట్టేందుకు ప్రయత్నిస్తాడని తెలిపాడు. పాత బంతితోనూ సమర్థంగా బౌలింగ్ చేయగలడని చెప్పాడు. పిచ్ నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా అదనపు బౌన్స్ రాబట్టగలడని, తొలి వన్డేలో అతడి ప్రదర్శన అద్భుతమని గిల్ కొనియాడాడు.

బుమ్రా అరుదైన క్లబ్‌లో చోటు

25 ఏళ్ల అన్‌షుల్ కాంబోజ్ తన వన్డే కెరీర్‌లో రెండో మ్యాచ్‌లోనే తొలి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అంతేకాకుండా వన్డేల్లో బ్యాటింగ్ చేసే అవకాశం రాకుండానే రెండు లేదా అంతకంటే తక్కువ వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్న భారత ఆటగాళ్ల జాబితాలో చేరాడు. ఈ జాబితాలో జస్ప్రీత్ బుమ్రా రెండుసార్లు చోటు సంపాదించాడు. కాంబోజ్‌తో కలిపి ఈ ఘనత సాధించిన భారత ఆటగాళ్లు ఎనిమిది మంది ఉన్నారు.

భారత బౌలర్ల జోరు

ఆక్లాండ్‌లో వర్షం అంతరాయాల మధ్య జరిగిన తొలి వన్డేలో భారత బౌలర్లు న్యూజిలాండ్‌ను 40.2 ఓవర్లలో 185 పరుగులకే ఆలౌట్ చేశారు. అన్‌షుల్ కాంబోజ్ 2 వికెట్లు తీయగా, అర్షదీప్ సింగ్ 4, గుర్నూర్ బ్రార్ 3 వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో విరాట్ కోహ్లీ 51 బంతుల్లో 74 పరుగులతో రాణించడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

కాంబోజ్ ఏమన్నాడంటే?

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న అనంతరం కాంబోజ్ తన బౌలింగ్ వ్యూహాన్ని వివరించాడు. పిచ్ పరిస్థితుల గురించి ఎక్కువగా ఆలోచించకుండా సరైన లైన్, లెంగ్త్‌పై దృష్టి పెట్టానని చెప్పాడు. వికెట్ నుంచి మంచి బౌన్స్ లభించడంతో తన లెంగ్త్‌లో ప్రత్యేకంగా మార్పులు చేయాల్సిన అవసరం రాలేదని తెలిపాడు. బేసిక్స్‌ను పాటించడమే తన విజయానికి కారణమని పేర్కొన్నాడు.