Simhadri Appanna Chandanotsavam : సింహాచలం వరాహ లక్ష్మీ నృసింహ స్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. గత ఏడాది వైఫల్యాలను దృష్టిలో పెట్టుకుని ఈ సారి ప్రోటోకాల్, అంతరాలయ దర్శనాలు నిలిపివేశారు. రెండు లక్షల మంది భక్తులు స్వామివారి దర్శనానికి వస్తారని అంచనా. ఆఖరి భక్తుడి వరకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా దర్శనం చేయించే బాధ్యతను సమిష్టిగా తీసుకున్నామంటున్నారు కలెక్టర్ మల్లిఖార్జున. సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం కోసం రద్దీ నెలకొననున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. సింహాచలం చందనోత్సవం కోసం రెండు వేల మంది పోలీసులుతో భద్రత ఏర్పాట్లు జరిగాయి. సింహగిరి మొత్తం సీసీ కెమెరా నిఘా, పర్యవేక్షణలో వుంది. భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగిన ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని సిటీ పోలీసు కమిషనర్ రవిశంకర్ అయ్యన్నార్ చెప్పారు. ఏడాదికి ఒకసారి జరిగే సింహాద్రి నాథుడు నిజరూప దర్శనం గురించి అందరికి తెలిసిందే.
Read Also: CM YS Jagan: నేటి సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే..
సింహాచల క్షేత్రంలో పశ్చిమాభిముఖుడై వెలసిన వరాహ నృసింహస్వామి విజయ ప్రదాతకు వైశాఖ శుద్ధ తదియనాడు చందనసేవ జరుగుతుంది. చల్లదనాన్ని అందించే చందనంతో తన శరీరాన్ని కప్పుకొని, భక్తులపై చల్లని చూపులను ప్రసరింప చేసే దేవుడు సింహాద్రి అప్పన్న చందనోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. చందనోత్సవం సందర్భంగా తెల్లవారు జామునుంచే దర్శనాలు మొదలయ్యాయి. మూడు గంటల నుంచి వైదిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి చేరుకొని తొలిపూజలో పాల్గొన్నారు. అప్పన్న నిజరూపాన్ని తొలి దర్శనం చేసుకున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి స్వామి వారి దర్శనం చేసుకున్నారు. ఏడాదికోసారి జరిగే సింహాద్రి అప్పన్న చందనోత్సవం కోసం భక్తులు ఎదురు చూస్తుంటారు. స్వామివారి నిజ స్వరూప దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు.