మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ankita Bhandari Case: లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద అంకిత భండారి తల్లిదండ్రులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్నారు. దీంతో 2022 నాటి ఉత్తరాఖండ్ రిసెప్షనిస్ట్ హత్య కేసు మళ్లీ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భారత రాష్ట్రపతి ఇటీవల బీజేపీ సీనియర్ నాయకుడు దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించారు. అయితే, ఈ కేసులో ప్రస్తుతం కొనసాగుతున్న సీబీఐ (CBI) విచారణ పూర్తయ్యే వరకు ఆ నియామకాన్ని నిలిపివేయాలని అంకిత కుటుంబం డిమాండ్ చేస్తోంది. గౌతమ్ నియామకాన్ని హోల్డ్‌లో పెట్టాలంటూ అంకిత తండ్రి వీరేంద్ర భండారి కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు విజ్ఞప్తి చేశారు. అంకిత హత్యకు దారితీసిన పరిస్థితులలో ఓ అజ్ఞాత వీఐపీ హస్తం ఉందని, ఆ వీఐపీ దుష్యంత్ కుమార్ గౌతమేనని ఆ కుటుంబం ఆరోపిస్తోంది. ఐతే ఈ ఆరోపణలను గౌతమ్ తీవ్రంగా ఖండించడమే కాకుండా, తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై డెఫమేషన్ (పరువు నష్టం) కేసులు కూడా పెట్టారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులకు కోర్టు శిక్ష ఖరారు చేసినప్పటికీ, అంకితపై లైంగిక వేధింపులకు పాల్పడేందుకు యత్నించిన ఆ వీఐపీ కోణంపై సరిగ్గా విచారణ జరిగిందా లేదా అనే అంశం చుట్టూనే ఇప్పుడు ప్రధాన వివాదం నడుస్తోంది. అంకిత కుటుంబం విజ్ఞప్తిని పట్టించుకోకుండా గౌతమ్‌ను గవర్నర్‌గా నియమించడంపై ఉత్తరాఖండ్ కాంగ్రెస్ కూడా తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. కేంద్ర, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆ వీఐపీ పాత్రపై దర్యాప్తు చేయాలన్న కుటుంబ సభ్యుల అభ్యర్థనను పట్టించుకోకపోవడమే కాకుండా, ఈ నియామకంతో వారి వేదనను మరింత పెంచాయని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు గణేష్ గోడియాల్ ఆరోపించారు.
అయితే ఈ ఆరోపణలపై ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మహేంద్ర భట్ స్పందిస్తూ, ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఈ కేసులో చాలా వేగంగా స్పందించిందని చెప్పారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయడం, ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేయడం, కోర్టులో సరైన ఆధారాలు సమర్పించడం మాత్రమే కాకుండా, బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం కూడా అందించామని తెలిపారు. అంతేకాకుండా, బాధితురాలి తల్లిదండ్రులు సీబీఐ విచారణ కోరగానే సీఎం ధామీ ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారని, ప్రభుత్వం ఈ సున్నితమైన కేసును అత్యంత తీవ్రంగా పరిగణించి కుటుంబ డిమాండ్లను నెరవేర్చిందని స్పష్టం చేశారు. ఆధారాలు, సాక్షుల ప్రకటనల ప్రాతిపదికనే పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారని, దానికి అనుగుణంగానే న్యాయస్థానం తన తీర్పును ఇచ్చిందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Also Read
- ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
- Supreme Court: "సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి".. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
- Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: మా వ్యూహం దెబ్బతిన్నది.. అదే కొంపముంచింది..
అసలు ఏంటి ఈ కేసు?
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఉన్న వనాంతర రిసార్ట్‌లో 19 ఏళ్ల అంకిత భండారి రిసెప్షనిస్ట్‌గా చేరిన కేవలం 20 రోజుల్లోనే, అంటే 2022 సెప్టెంబర్ 18న హత్యకు గురైంది. ఈ రిసార్ట్‌ను మాజీ బీజేపీ నాయకుడు వినోద్ ఆర్య కుమారుడైన పుల్కిత్ ఆర్య నిర్వహించేవాడు. అంకిత మిస్సింగ్ అయిన ఆరు రోజుల తర్వాత ఆమె మృతదేహం ఓ కాలువలో లభించింది. రిసార్ట్‌కు వచ్చే కస్టమర్లకు “ప్రత్యేక సేవలు” (లైంగిక సేవలు) అందించాలని అంకితపై ఒత్తిడి తెచ్చారని, దానికి ఆమె తీవ్రంగా నిరాకరించడమే ఈ హత్యకు కారణమని పోలీసుల ఎస్ఐటీ విచారణలో తేలింది. ఈ కేసును విచారించిన పౌరీ గఢ్వాల్ కోర్టు, 2025 మే నెలలో ప్రధాన నిందితుడు పుల్కిత్ ఆర్యతో పాటు అతని సహచరులు అంకిత్ గుప్తా, సౌరభ్ భాస్కర్లను దోషులుగా తేలుస్తూ వారందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుతో ఆ ముగ్గురి క్రిమినల్ బాధ్యత నిరూపితమైనప్పటికీ, కేసులో ఓ వీఐపీ ఉన్నారని ఆ కుటుంబం చెబుతోంది.
నిజానికి కేసు ప్రారంభం నుంచే ఈ వీఐపీ అంశంపై పలు అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. ట్రయల్ సమయంలో కూడా, రిసార్ట్‌లో అదనపు సేవలు అందించాలని తనపై ఒత్తిడి తెస్తున్నారని, అందుకే తాను ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోవాలని అనుకుంటున్నట్లు అంకిత తన స్నేహితులకు పంపిన సందేశాలను ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించింది. దీంతో ఈ ముగ్గురు కాకుండా వెనుక ఉండి నడిపిన ఆ పెద్ద మనిషి ఎవరనే దానిపై సమగ్ర విచారణ జరగాలని కుటుంబ సభ్యులు నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. ఈ వివాదం 2025 డిసెంబర్లో మరిన్ని మలుపులు తిరిగింది. మాజీ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్ భార్యనని చెప్పుకునే ఊర్మిళ సనావర్ అనే మహిళ కొన్ని వీడియోలు, ఆడియో క్లిప్‌లను బయటపెట్టింది. అందులో ‘గట్టు’ అని పిలిచే ఓ సీనియర్ నేతయే ఈ కేసులోని వీఐపీ అని ఆరోపించింది. ఆ సంభాషణలో రాథోడ్, గౌతమ్ పేరును ఈ వివాదంతో ముడిపెట్టినట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ ఆడియో క్లిప్ AI (కృత్రిమ మేధ)తో సృష్టించిన నకిలీదని రాథోడ్ పేర్కొనగా, గౌతమ్ కూడా ఆ ఆరోపణలను ముమ్మాటికీ ఖండించారు. అంతకుముందు కూడా పోలీసు ఎస్ఐటీ తన విచారణలో ఏ ప్రముఖ రాజకీయ నాయకుడి ప్రమేయానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదని చెప్పడం గమనార్హం.
ఈ ఆరోపణల నేపథ్యంలో 2026 జనవరిలో ఉత్తరాఖండ్ వ్యాప్తంగా మళ్లీ నిరసనలు మిన్నంటేసరికి సీఎం ధామీ కేసును సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. ఐతే ఇప్పటికే జైలుకు వెళ్లిన ముగ్గురు నిందితుల చుట్టూనే కాకుండా, అసలు హత్యకు గల పూర్తి కోణం, ఆ వీఐపీ ఎవరనే దానిపైనే సీబీఐ ప్రధానంగా దృష్టి పెట్టాలని అంకిత తండ్రి వీరేంద్ర కోరారు. అంతేకాకుండా ఈ దర్యాప్తు రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో జరగాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై న్యాయపోరాటం కూడా మొదలైంది. 2026 జనవరిలోనే దుష్యంత్ కుమార్ గౌతమ్ తన పేరును హత్యతో తప్పుగా ముడిపెడుతున్నారని ఆరోపిస్తూ సనావర్, రాథోడ్, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలపై పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. దాంతో కేసుతో గౌతమ్‌కు సంబంధం ఉన్నట్లు పెట్టిన సోషల్ మీడియా పోస్టులను 24 గంటల్లోగా తొలగించాలని ఢిల్లీ హైకోర్టు కాంగ్రెస్, ఆప్‌లను ఆదేశించింది. ఆ తర్వాత జూన్ నెలలో, గౌతమ్‌పై కుట్రపూరితంగా నిందలు వేయడానికి ప్రయత్నించారనే ఆరోపణలపై సురేష్ రాథోడ్‌ను డెహ్రాడూన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు చుట్టూ జరుగుతున్న రాజకీయ, న్యాయ పోరాటాల నడుమే రాహుల్ గాంధీ అంకిత తల్లిదండ్రుల ధర్నాకు మద్దతు తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజావార్తలు
-
మళ్లీ తెరపైకి Ankita Bhandari Case.. ఢిల్లీలో అంకిత తల్లిదండ్రుల నిరసన.. రాహుల్ గాంధీ మద్దతు..!
-
Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి మిశ్రమ ఫలితాలు.. మరి ఏం చేయాలి?
-
ICC Rankings: గెలుపోటములతో సంబంధం లేదు.. టీ20 ర్యాంకింగ్‌లో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్..
-
Supreme Court: “సాకులు చెప్పొద్దు.. ఆధారాలు కావాలి”.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు హెచ్చరిక!
-
Shai Hope: 244 టార్గెట్ సరిపోదనుకున్నాను.. అక్కడే మలుపు తిరిగింది: వెస్టిండీస్ కెప్టెన్
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..