Kaviya Maran: సన్‌రైజర్స్ ఓనరమ్మతో అనిరుధ్ పెళ్లి పక్కా.. బంధువుల ఇంటర్వ్యూతో లీకైన పెళ్లి ముచ్చట..

Kavya Maran Marriage

Kavya Maran Marriage

సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా దూసుకుపోతున్న అనిరుధ్ రవిచందర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ జట్టు సీఈవో కావ్య మారన్ లవ్ లైఫ్ , పెళ్లి గురించి గత కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. గతంలో ఈ వార్తలను అనిరుధ్ కేవలం పుకార్లని కొట్టిపారేసినప్పటికీ, తాజాగా ఈ ఇద్దరి వివాహంపై ఓ సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. అనిరుధ్‌కు వరుసకు పెద్దనాన్న అయ్యే ప్రముఖ సీనియర్ నటుడు వై.జీ. మహేంద్రన్ ఒక తాజా ఇంటర్వ్యూలో వీరి పెళ్లి వార్తలను అధికారికంగా ధృవీకరించారు.

ఈ ఇంటర్వ్యూలో వై.జీ. మహేంద్రన్ మాట్లాడుతూ.. అనిరుధ్ మరియు కావ్య మారన్ ల వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకారం తెలిపారని, త్వరలోనే వారు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని వెల్లడించారు. అనిరుధ్ చాలా మృదు స్వభావుడని, కావ్య మారన్ ఎంతో సమర్థురాలని ఆయన ప్రశంసించారు. కావ్య సాధారణ అమ్మాయి కాదని, ఒక ఐపీఎల్ జట్టును అంత విజయవంతంగా నడిపించగల వ్యాపార నైపుణ్యాలు ఆమెకు తన తండ్రి నుంచే వచ్చాయని పేర్కొన్నారు. ఈ ఇద్దరూ ఒకరికొకరు సరైన జోడీ అని, భవిష్యత్తులో వీరు కలిసి మ్యూజికల్ బిజినెస్ రంగంలో అద్భుతాలు సృష్టిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

సన్ గ్రూప్ అధినేత కళానిధి మారన్ కుమార్తె అయిన కావ్య మారన్, క్రికెట్ మైదానంలో తన హావభావాలతో దేశవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. మరోవైపు, కళానిధి మారన్ నేతృత్వంలోని సన్ పిక్చర్స్ నిర్మించిన ‘జైలర్’, ‘బీస్ట్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలకు అనిరుధ్ బ్లాక్‌బస్టర్ మ్యూజిక్ అందించారు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న ఈ వృత్తిపరమైన సాన్నిహిత్యమే ఇప్పుడు బంధుత్వంగా మారబోతోందని కోలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. కుటుంబ సభ్యుల నుండి ఈ స్పష్టత రావడంతో, త్వరలోనే ఈ స్టార్ కపుల్ తమ పెళ్లి తేదీని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని నెటిజన్లు భావిస్తున్నారు.