ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా ఎంతో వివరించారు కేంద్రం ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఏపీ వాటా 0.2% లోపే వుందన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీలో అత్యాధునిక ఇంక్యుబేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది భారత ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో యువత భవిష్యత్తు నాశనమవుతోందని మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. 2021-22లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల విలువ కేవలం రూ.926 కోట్లు మాత్రమేనని రాజ్యసభ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి తెలిపారు. భారతదేశం నుంచి జరిగిన ఐటీ ఎగుమతుల్లో ఇది కేవలం 0.14% మాత్రమే. గత ఐదేళ్లలో ఐటీ ఎగుమతుల్లో ఏపీ వాటా ఎప్పుడూ 0.2% కంటే తక్కువగానే ఉందన్నారు.
Read Also: Tirupati IIT: జూన్ నాటికి తిరుపతి ఐఐటి క్యాంపస్ సిద్ధం
దేశంలోనే ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నం ప్రధాన ఐటి హబ్‌గా ఎదగడానికి గల అవకాశాల గురించి అడిగినప్పుడు, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంచి మౌలిక సదుపాయాలు, భారీ ఉత్పాదక స్థావరాలు (base), I/TITES పరిశ్రమ అభివృద్ధికి ప్రతిభావంతులైన యువత మరియు వ్యాపార అనుకూల వాతావరణం ఉన్నాయని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇతర ఇంక్యుబేషన్ సెంటర్‌ల గురించి అడిగినప్పుడు, ICT స్టార్టప్‌లకు మద్దతుగా “టెక్నాలజీ ఇంక్యుబేషన్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ (TIDE) 2.0” అనే పథకం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఐదు ఇంక్యుబేషన్ సెంటర్లు పనిచేస్తున్నాయని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. వీటిలో విశాఖపట్నంలో రెండు, తిరుపతి, గుంటూరు, చిత్తూరులో ఒక్కొక్కటి పనిచేస్తున్నాయని శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు. అలాగే, STPIకి కాకినాడ, విజయవాడ మరియు తిరుపతిలలో మూడు ఇంక్యుబేషన్ సెంటర్లు మరియు ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి మరియు విజయవాడలలో నాలుగు STPI కేంద్రాలు ఉన్నాయని మంత్రి తెలిపారు.
విశాఖపట్నంలో సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) పూర్తి స్థాయి ఇంక్యుబేషన్ సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడంలో జాప్యానికి గల కారణాలను అడిగినప్పుడు, ఎస్‌టిపిఐ మరియు ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ (ఎపిఐఎస్) సంయుక్త తనిఖీ నిర్వహించాయని, అయితే సరైన స్థలం చూపించలేదని కేంద్ర మంత్రి చెప్పారు. విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీలో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎస్‌టిపిఐ ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు కోసం ఎస్‌టిపిఐకి ఒక ఎకరం భూమిని అందించేందుకు ఆంధ్రా యూనివర్సిటీ జనవరి 2023లో అంగీకారం తెలిపిందని ఆయన తెలిపారు.
ఈ అంశంపై రాజ్యసభ ఎంపీ జీవీఎల్ స్పందిస్తూ, దేశంలో ఐటీ మ్యాన్‌పవర్‌లో ఆంధ్రప్రదేశ్ వాటా 10% ఉందని, అయితే ఐటీ ఎగుమతుల్లో కేవలం 0.2% కంటే తక్కువ వాటా ఉందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా కృషి చేయకపోవడం వల్ల రాష్ట్రంలోని యువత ఉద్యోగాల కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి వస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు.
Read Also: Punjab Kings: పంజాబ్ జట్టులో కీలక మార్పు.. ఆల్‌రౌండర్ స్థానంలో అతడు