ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పలు సూచనలు జారీ చేసింది. జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం నాడు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. దీని ప్రభావంతో రేపు ( బుధవారం ) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని పేర్కొన్నారు.
Read Also: RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొత్త జెర్సీ లీక్.. ఫొటో ఇదిగో
ఇక, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది అని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండండి.. దయచేసి వ్యవసాయ, ఉపాధి పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు, టవర్స్, పోల్స్ క్రింద ఉండకండి.. పొలాలు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదు.. అలాగే, సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందండి అని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచనలు జారీ చేశారు.