Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశంలోని ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ మీటింగ్ చేస్తున్న మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవబోతోంది. ఏపీ వ్యాప్తంగా రేపు మెగా పేరెంట్ టీచర్ మీట్ జరగనుంది. 44,303 పాఠశాలల్లో ఒకేరోజు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు. 38,319 మండలపరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలు.. 2,807 మునిసిపల్ పాఠశాలలు, 1054 రెసిడెన్షియల్, 2843 ప్రభుత్వ పాఠశాలల్లో రేపు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకూ సమావేశం నిర్వహించనున్నారు. కోటి మందికి పైగా ఈ సమావేశంలో పాల్గొంటారని అంచనా వేస్తున్నారు.
Read Also: Minister Satya Kumar Yadav: ప్రమాదంలో 108 అంబులెన్స్ పైలట్ దుర్మరణం.. ఆరా తీసిన మంత్రి
దేశంలోనే మొట్టమొదటి సారిగా ఏపీలో పేరెంట్ టీచర్ మీట్ నిర్వహిస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానిస్తున్నారు. అందరు తల్లిదండ్రులలో ఒకరి అధ్యక్షతన పూర్తి కార్యక్రమం జరగనుంది. విద్యార్థుల తలిదండ్రులకు విద్యార్థులే తయారు చేసిన ఇన్విటేషన్లను పంపారు. ప్రతీ స్కూలులో పూర్వ విద్యార్థులకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. తండ్రులకు టగ్ ఆఫ్ వార్, తల్లులకు రంగోలీ పోటీలు నిర్వహించనున్నారు. పిల్లల ప్రోగ్రెస్‌పై ప్రత్యేక కార్డులు… విద్యార్ధి ప్రోగ్రెస్‌పై ప్రతీ పేరెంట్, స్టూడెంట్‌కి ప్రత్యేక వివరణ ఇవ్వనున్నారు. పేరెంట్స్ నుంచీ విద్యా విధానంపై సలహాలు, సూచనలను సేకరించనున్నారు. కంప్లైంట్స్ కూడా నమోదు చేయడంతో పాటు పరిష్కారం అక్కడికక్కడే చేయనున్నారు. విద్యార్థులకు ఏర్పాటు చేసే మధ్యాహ్న భోజనమే తల్లిదండ్రులకు కూడా పెట్టనున్నారు. భోజనం ఎలా ఉందనే దానిపైనా తల్లిదండ్రుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు. మరోవైపు.. ఈ పొలిటికల్ బ్యానర్లు ఏవీ ఈ కార్యక్రమంలో ఉండబోవని అధికారులు స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబు నాయుడు బాపట్ల స్కూల్‌లో కార్యక్రమంలో పాల్గొంటారు.. ప్రతీ ఎమ్మెల్యే, ప్రతీ మంత్రి వారి నియోజకవర్గాల్లో పాల్గొనాలని మంత్రి నారా లోకేష్ తెలిపారు.. మొత్తంగా ఏపీ విద్యాశాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది.