NTV Telugu Site icon

Andhra Pradesh: విద్యారంగంలో గేమ్‌ ఛేంజర్‌.. ‘ఎడెక్స్’తో ఏపీ సర్కార్ కీలక ఒప్పందం

Cm Ys Jagan

Cm Ys Jagan

Andhra Pradesh: ఇప్పటికే విద్యారంగంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఇప్పుడు మరో విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుట్టారు.. ఉన్నతవిద్యలో ప్రపంచస్థాయి కోర్సులు తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారు.. హార్వర్డ్‌, ఎంఐటీ, ఆక్స్‌ఫర్డ్‌, క్రేంబ్రిడ్జి సహా పలు ప్రపంచ అత్యుత్తమ వర్శిటీల నుంచి సంయుక్త సర్టిఫికెట్లు అందించే విధంగా చర్యలు తీసుకోనున్నారు.. ఉన్నతవిద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు ఉచితంగా కోర్సులు అందించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. దీని కోసం ప్రఖ్యాత సంస్థ ఎడెక్స్‌తో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది.. ప్రఖ్యాత మాసివ్‌ ఓపెన్‌ ఆన్‌లైన్‌ కోర్సులు కంపెనీ (MOOC) ఎడెక్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహనా ఒప్పందం చేసుకుంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో.. ఒప్పందంపై సంతకాలు చేశారు ఎడెక్స్‌ వ్యవస్థాపకుడు, సీఈవో, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనంత్‌ అగర్వాల్‌, ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె శ్యామలరావు.

Read Also: Daggubati Abhiram: దగ్గుబాటి ఇంట పెళ్లి సందడి.. ?

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఈ ఒప్పందం ఉన్నత విద్యలో గేమ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందన్నారు. నిరుపేద విద్యార్థులకు ఈ ఒప్పందం కారణంగా మరింత మేలు జరుగుతుంది. ఉన్నత విద్య అభ్యసిస్తున్న విద్యార్థికి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను నేర్చుకునే అవకాశం ఉంటుందన్నారు. కోర్సులు చేసిన విద్యార్థులకు హార్వర్డ్‌, ఎంఐటీ, క్రేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్‌ లాంటి యూనివర్శిటీలతో ఎడెక్స్‌ సంయుక్త సర్టిఫికేషన్‌ విద్యార్థులకు లభిస్తుందని వెల్లడించారు. వారికి ఉచితంగా ఈ కోర్సులు అందుబాటులోకి వస్తాయి.. ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఈ సర్టిఫికెట్లు మరింతగా మెరుగుపరుస్తాయని పేర్కొన్నారు. మన దేశంలో లభ్యం కాని ఎన్నో కోర్సులను కూడా నేర్చుకునే అవకాశం వస్తుందని.. వివిధ కోర్సులకు అందుబాటులో లేని బోధనా సిబ్బంది కొరతను కూడా అధిగమించినట్టు అవుతుందన్నారు సీఎం. దీని కోసం ఇప్పుడున్న ప్రతి కోర్సులనూ, అందులో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులను పూర్తిగా పరిశీలించాలని.. దీని కోసం ఒక బోర్డును ఏర్పాటు చేయాలని.. అంతిమంగా మంచి ఉపాధి, ఉద్యోగావకాశాలు రాష్ట్ర విద్యార్థులకు దక్కాలని ఆకాక్షించారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.