Pawan Kalyan: అకాల వర్షాలతో కుదేలైన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైందన్న ఆయన.. ప్రాథమిక అంచనా మేరకు 3 లక్షల ఎకరాలలో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయి. వరి, మామిడి, మొక్కజొన్న, అరటి, మిరప రైతులు ఆవేదనలో ఉన్నారు. బాధిత రైతులకు అండగా నిలిచి ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందన్నారు.. దెబ్బ తిన్న పంటల గణనను సత్వరమే చేపట్టి, మానవతా దృక్పథంతో నష్ట పరిహారాన్ని చెల్లించాలని కోరారు.. వరి సాగు చేసిన రైతులను ఈ వర్షాలు తీవ్రంగా దెబ్బ తీశాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: Papikondalu Tour Cancel: పాపికొండల విహార యాత్రకు మళ్లీ బ్రేక్..
మరోవైపు, ధాన్యం కొనుగోలు పకడ్బందీగా సాగటం లేదని విమర్శించారు పవన్ కల్యాణ్.. గోదావరి జిల్లాల్లో సాగు చేసిన జయ రకం (బొండాలు) ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్న ఆయన.. దీంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. ఆర్బీకేల్లో తీసుకోకపోవడం వల్ల బస్తాకు రూ.300 నష్టంతో మిల్లర్లకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వ వైఖరి మూలంగా కష్టపడిన రైతు నష్టపోతున్నాడు.. దళారులు, మిల్లర్లు లాభపడుతున్నారన్నారు.. అదే విధంగా మామిడి నేల రాలిపోయింది. మొక్క జొన్న కూడా మొలకెత్తిపోతోంది. ప్రకృతి విపత్తులతో నష్టపోయే రైతులు, ముఖ్యంగా కౌలు రైతుల వేదన కళ్ళారా చూశాను అన్నారు. నివర్ తుఫాను వల్ల నష్టపోయిన రైతులను వారి పొలాల్లో, కళ్ళాల్లో కలిసినప్పుడు వారుపడ్డ బాధలు తెలుసుకున్నాను.. కౌలు రైతు భరోసా యాత్రలో వారి ఆవేదన విన్నాను. ప్రకృతి విపత్తుల మూలంగా పంటలు కోల్పోతున్న రైతులను ఆదుకొనేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకువస్తాం. దీనిపై రైతు ప్రతినిధులు, వ్యవసాయ ఆర్థిక వేత్తలతో చర్చిస్తున్నామని వెల్లడించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.