CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు.. విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి శంకుస్ధాపన చేయనున్న ఆయన.. చింతపల్లి ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం, తారక రామ తీర్ధ సాగర్ ప్రాజెక్ట్ మిగులు పనులకు శ్రీకారం చుట్టనున్నారు. ఇక, విశాఖపట్నం–మధురవాడలో వైజాగ్ ఐటీ టెక్ పార్క్‌కు శంకుస్ధాపన చేస్తారు.. ఉత్తరాంధ్రకే తలమానికమైన భోగాపురం అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణానికి సీఎం వైఎస్ జగ ఈ రోజు భూమి పూజ చేయనున్నారు. దీంతోపాటు విజయనగరం జిల్లాలో మరో రెండు కీలక ప్రాజెక్టులతోపాటు విశాఖలో రూ.21,844 కోట్లతో అదానీ గ్రూప్ నిర్మించే వైజాగ్ టెక్‌పార్క్ లిమిటెడ్‌కు సీఎం జగన్ చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నాయి. రూ.4,592 కోట్లతో భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం నిర్మాణం కానుండగా ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చి సమగ్రాభివృద్ధికి బాటలు వేసేలా వైజాగ్ టెక్ పార్కు రూపుదిద్దుకోబోతోంది.
ఇక, భోగాపురం మండలం సవరవిల్లి వద్ద నిర్వహించే బహిరంగ సభలో ప్రసంగిస్తారు సీఎం జగన్.. విశాఖ ఎయిర్‌పోర్టుకి ప్రత్యామ్నాయంగా అత్యాధునిక సౌకర్యాలతో భోగాపురం మండలంలో 36 నెలల్లో నిర్మించే అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి ముఖ్యమంత్రి జగన్ భూమిపూజ చేస్తారు. దాదాపు 2,203 ఎకరాల విస్తీర్ణంలో రూ.4,592 కోట్ల వ్యయంతో జీఎంఆర్ విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు లిమిటెడ్ దీన్ని నిర్మిస్తోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో పాటు దేశీయ, అంతర్జాతీయ రవాణాకు దోహదపడేలా కార్గో టెర్మినల్ ఇక్కడి ప్రత్యేకత. తొలి దశ నిర్మాణమే ఏటా 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు వీలుగా ఉంటుంది. అనంతరం ఏటా 1.8 కోట్ల మంది ప్రయాణించే విధంగా దశలవారీగా సౌకర్యాలను విస్తరిస్తారు. మరోవైపు.. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో రూ.14,634 కోట్లతో మధురవాడలో 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్ ఏర్పాటు కానుంది. త్వరలో రూ.7,210 కోట్లతో కాపులుప్పాడలో మరో 100 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్, టెక్నాలజీ, బిజినెస్ పార్క్‌లను అభివృద్ధి చేస్తారు. తద్వారా 39,815 మందికి ప్రత్యక్షంగా, మరో 10,610 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
విజయనగరం జిల్లాలో 24,710 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చంపావతి నదిపై 2005 సంవత్సరంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నాంది పలికారు. అయితే పెండింగ్ పనులను రూ.194.90 కోట్లతో పూర్తి చేసేందుకు సీఎం జగన్ పూనుకున్నారు.. పూసపాటిరేగ, భోగాపురం, డెంకాడ మండలాల్లోని 49 గ్రామాల ప్రజలకు తాగునీరు, 24,710 ఎకరాలకు సాగునీటితో పాటు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన నీటిని అందించడం లక్ష్యంగా తారకరామ తీర్ధ సాగరం ప్రాజెక్ట్ చేపట్టారు. 2024 డిసెంబర్ నాటికి పనులు పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. మరోవైపు, చింతపల్లి సముద్ర తీరంలో రూ.23.73 కోట్ల వ్యయంతో ఫిష్ ల్యాండింగ్ సెంటర్ నిర్మాణం కానుంది. అన్ని కాలాల్లో సముద్రంలో చేపలు వేటాడేందుకు వెసులుబాటు కలగనుంది. విశాఖ–భోగాపురం మధ్య రూ.6,300 కోట్లతో 55 కిలోమీటర్ల మేర 6 లేన్ల రహదారి నిర్మాణం కానుంది. రెండువైపులా సర్వీసు రోడ్లు ఉంటాయి. ఎయిర్‌పోర్టు నిర్మాణ సమయంలో 5 వేల మందికి, సేవలు ప్రారంభం అయిన తర్వాత 10 వేల మందికి ప్రత్యక్షంగా, 80 వేల మందికి పరోక్షంగా ఉపాధి దక్కుతుందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు అదానీ డేటా సెంటర్‌తో ఐటీ బూమ్ రాబోతోంది.. డేటా హబ్‌తో డేటా స్పీడ్ గణనీయంగా పెరగనుంది. సింగపూర్ – విశాఖ వరకు సముద్ర సబ్‌మెరైన్ కేబుల్ ఏర్పాటు ద్వారా ఇంటర్నెట్ బ్యాండ్ విడ్త్ ఐదు రెట్లు పెరుగుతుంది. తద్వారా భవిష్యత్‌లో ఈ ప్రాంతంలో మరిన్ని ఐటీ సంస్థలు ఏర్పాటు కానున్నాయి. విశాఖలో హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుతో ఐటీ, ఐటీ అనుబంధ సేవల్లో వృద్ధి నమోదు కానుంది. భారీ స్ధాయిలో హైటెక్ ఉద్యోగాల కల్పనకు సానుకూల వాతావరణం నెలకొంటుంది.
సీఎం పర్యటనలో స్వల్ప మార్పులు..
అయతే, ముందుకు నిర్ణయించిన సీఎం షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి.. ఉదయం ఏడు గంటలకే తాడేపల్లిలోని నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయల్దేరి.. గన్నవరం నుండి హైదరాబాద్‌కు.. ఉదయం 8 గంటల 10 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న తర్వాత.. తిరిగి విశాఖపట్నంకు బయల్దేరేలా షెడ్యూల్ రూపొందించారు.. కానీ, షెడ్యూల్ మార్చేశారు.. గన్నవరం నుండి హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి వచ్చే షెడ్యూల్ లో మార్పు చేస్తూ.. నేరుగా గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోబోతున్నారు సీఎం జగన్.. ఇక, సీఎం పర్యటన కోసం భారీ భద్రత ఏర్పాట్లు చేశారు.. ఋషికొండ ఐటీ పార్క్ ఏరియాలో 1300మంది పోలీసులు బందోబస్తు పెట్టారు.. మరోవైపు.. నేడు నగరానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ రానున్నారు.. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ నిర్మాణం భూమి పూజలో పాల్గొనబోతున్నారు అదానీ.