Artificial Paneer Ban in AP: కృత్రిమ పన్నీరు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. కృత్రిమ పన్నీరు తయారీ, నిల్వ, రవాణా, విక్రయాలు, వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ప్రజారోగ్య పరిరక్షణ, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. నిషేధానికి సంబంధించి ఆహార భద్రత శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ పేరుతో ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. పాల నుంచి తయారు చేసే సంప్రదాయ పన్నీరుకు బదులుగా శాఖాహార కొవ్వులు, పామాయిల్, పాలపొడి తదితర పదార్థాలను ఉపయోగించి కృత్రిమ పన్నీరు తయారు చేస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తుండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్లలో వీటిని విస్తృతంగా వినియోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కొన్ని ప్రాంతాల్లో కృత్రిమ చీజ్‌ను కూడా పన్నీరు పేరుతో ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.
సంప్రదాయ పాల పన్నీరు, కృత్రిమ పన్నీరు మధ్య తేడాను వినియోగదారులు సులభంగా గుర్తించలేకపోయే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్యానికి ముప్పు కలగకుండా ప్రభుత్వం నిషేధ నిర్ణయం తీసుకుంది. పన్నీరు కొనుగోలు చేసేటప్పుడు దాని రంగు, వాసన, మెత్తదనం, వేడి చేసినప్పుడు కలిగే మార్పులను పరిశీలించాలని ఆహార భద్రత శాఖ డైరెక్టర్ అరుణ్‌బాబు సూచించారు. ముఖ్యంగా తక్కువ ధరకు లభించే పన్నీరు ఉత్పత్తుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఇక, దేశవ్యాప్తంగా కృత్రిమ పన్నీరు విక్రయాలను నిషేధించే దిశగా రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సూచించినట్లు అధికారులు చెబుతున్నారు..

