బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రతిభ, పట్టుదలకు సలాం కొట్టాల్సిందే. ఐదు దశాబ్దాలుగా ఆయన యాక్టింగ్‌తో అభిమానులను కట్టి పారేశారు. చిత్ర పరిశ్రమలో “బిగ్ బీ” అని ముద్దుగా పిలువబడే ఆయన లెక్కలేనన్ని హిట్‌లను అందించారు. 82 ఏళ్లు దాటింది. ఇప్పటికీ ఆయన యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇప్పటి ప్రజలకు ఆయన సక్సెస్ మాత్రమే తెలుసు. కానీ.. 90లలో బిగ్ బీ పడిన ఇబ్బందుల గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. గతంలో అప్పులను తీర్చేందుకు నానా యతన పడ్డారు. గతంలో జర్నలిస్ట్ వీర్ సంఘ్వీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను పడిన ఇబ్బందుల గురించి బిగ్‌బీ చెప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ స్టోరీని పూర్తిగా తెలుసు కుందాం..
1969లో సాత్ హిందుస్థానీ చిత్రంతో అమితాబ్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అయితే కొన్నేళ్లపాటు ఆయనకు విజయం వరించలేదు. ఎక్కడా కూడా తగ్గకుండా కృషిని మాత్రమే నమ్ముకున్నారు. అప్పటికీ ఆయన వయసు 30. అలా పోరాటం చేస్తూనే సినిమా అవకాశాలు దక్కించుకున్నారు. అయినా 12 చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి. రెండే చిత్రాలు విజయవంతయ్యాయి. పరిస్థితులు ఎంత వెనక్కి లాగుతున్నా.. భయపడలేదు. రాను రానూ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా అమితాబ్ కీర్తి గడించారు. సినిమాల తర్వాత సినిమాలు, హిట్‌లు తర్వాత హిట్‌లు బిగ్‌బీ రేంజ్‌ను మార్చేశాయి.
అంతా బాగానే సాగుతోంది. సడెన్‌గా1990ల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. భారీ సవాళ్లను ఎదురుకున్నారు అమితాబ్.1990ల్లో అమితాబ్ బచ్చన్ స్థాపించిన AB కార్పొరేషన్ భారీ నష్టాలను చవిచూసింది. దీంతో బిగ్‌బీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారు. రుణదాతలకు రూ.90 కోట్లు బకాయిపడ్డారు. ఈ క్రమంలోనే ఆయనపై 55 లీగల్ కేసులు కూడా నమోదు అయ్యాయి. దీంతో అప్పటివరకూ తనకు మిత్రులుగా ఉన్నవారే ఆ సమయంలో తనతో మాట్లాడేందుకు కూడా సంశయించారని అమితాబ్ ఆ ఇంటర్వ్యూలోనూ గుర్తు చేసుకున్నారు. అయినా ఆయన ఎక్కడా తగ్గలేదు. కృషి, పట్టుదలతో ముందుకు సాగారు.
అదే సమయంలో అమితాబ్‌తో యశ్ చోప్రా తీసిన మొహబత్తీన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. ఆ ఘన విజయంతో బిగ్ బి మళ్లీ బౌన్స్ బ్యాక్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన కౌన్ బనేగా కరోడ్‌పతి అమితాబ్ రేంజ్‌ను మళ్లీ ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లింది. ఇకపోతే ఇప్పుడు అమితాబ్- జయాబచ్చన్ దంపతుల నెట్ వర్త్ రూ.1500 కోట్లకుపైనే ఉంటుందని సమాచారం. ఇలా ఈ బాలీవుడ్ మెగాస్టార్ కూడా ఎన్నొ ఇబ్బందులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు. అప్పట్లో పెద్ద ఎత్తున వైరల్ అయిన ఇంటర్వ్యూ వీడియో, వార్తలు, ప్రస్తుతం మళ్లీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.