Luxury Cars Trigger ₹38 Lakh Tax Penalty: బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, ఆమీర్‌ఖాన్ లకు చెందిన రెండు లగ్జరీ కార్లు బెంగళూరులో పన్ను వివాదానికి దారితీశాయి. దీని ఫలితంగా వాటి ప్రస్తుత యజమాని, ప్రముఖ వ్యాపార వేత్త ‘కేజీఎఫ్ బాబు’ పై రూ.38 లక్షల జరిమానా విధించారు. ఆర్టీఓ ఈ చర్య తీసుకుంది. కర్ణాటక రోడ్డు పన్ను ఎగవేసినందుకు ఈ లగ్జరీ కార్ బ్రాండ్ కు చెందిన రెండు మోడళ్లపై బెంగళూరు ఆర్టీఓ రూ.38 లక్షల భారీ జరిమానా విధించింది. ఈ కార్లు ప్రస్తుతం అమితాబ్ బచ్చన్, ఆమీర్‌ఖాన్ పేరిట రిజిస్ట్రేషన్ లేవు. కానీ.. ఈ లగ్జరీ కార్ల మొదటి ఓనర్లు వీళ్లే. కొన్నేళ్ల కిందట వీటిని కర్ణాటక రాష్ట్రానికి చెందిన వ్యాపారవేత్త కేజీఎఫ్ బాబు కొనుగోలు చేశారు.
అసలు ఏం జరిగిందంటే.. విలాసవంతమైన కార్లను బెంగళూరులో నడుపుతూ.. వాటికి ఏడాది నుంచి పన్ను చెల్లించని ఆరోపణలపై ముంబై రవాణా శాఖ కార్యాలయంలో కేసు నమోదైంది. దీంతో బుధవారం పారిశ్రామికవేత్త కేజీఎఫ్ బాబు నివాసంపై రవాణాశాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ లగ్జారీ కార్లపై బెంగళూరులో పన్ను చెల్లించడం లేదన్న ఆరోపణలపై వసంతనగరలోని ఆయన నివాసంపై ఆర్‌టీఓ జాయింటు కమిషనర్ ఎం.శోభ నేతృత్వంలోని అధికారులు దాడి చేశారు. బెంగళూరు, ముంబైలో సైతం ఈ కార్లను నడుపుతున్నట్లు కేజీఎఫ్ బాబు స్పష్టం చేశారు. కర్ణాటకలోనే ఎక్కువగా నడుపుతున్నారు కాబట్టి.. మహారాష్ట్ర బదులుగా కర్ణాటకలోనే పన్ను చెల్లించాలని అధికారులు సూచించారని చెప్పారు. ఈ మేరకు నోటీసు ఇచ్చినట్లు వెల్లడించారు. చట్ట ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కారు ఏడాది కన్నా ఎక్కువ సమయం ఇక్కడే ఉంచుకోవాలంటే ప్రత్యేకంగా పన్ను చెల్లించాలని రవాణాశాఖ అధికారులు ఆయనకు వివరించారు. రూ.38 లక్షలకు నోటీసులు ఇవ్వడంతో ఆన్లైన్ ద్వారా కేజీఎఫ్ బాబు చెల్లింపులు చేశారు.