NTV Telugu Site icon

MBBS in Hindi: స్టూడెంట్స్‎కు గుడ్ న్యూస్.. హిందీలోనూ ఎంబీబీఎస్ కోర్స్ చదివే అవకాశం

Mbbs

Mbbs

MBBS in Hindi: ఎంబీబీఎస్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త. దేశంలో తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం(2022-23) ఎంబీబీఎస్ కోర్సును హిందీ మాధ్యమంలో అందించేందుకు రంగం సిద్ధమైంది. గతేడాది నుంచి బీటెక్‎ కోర్సును ప్రాంతీయ భాషల్లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతేడాది ఏపీలోని ఒక కళాశాలతో పాటు మొత్తం 14 కాలేజీల్లో ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్ బోధించేందుకు ముందుకు వచ్చాయి. ఈసారి ఆ సంఖ్య 20 కి పెరిగింది. తాజాగా హిందీలో ఎంబీబీఎస్ ను అందించేందుకు రెండు రాష్ట్రాలు ముందుకు వచ్చాయి. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ లోని గాంధీ మెడికల్ కళాశాల, ఛత్తీస్గడ్ లోని బిలాస్ పూర్ లోని అటల్ బిహారి వాజ్ పేయి విశ్వవిద్యాలయం దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నాయి.

Read Also: worlds most flexible girl: ఈ అమ్మాయి ఒంట్లో ఎముకలున్నాయా.. డౌటే..?

తమ రాష్ట్రంలో త్వరలో ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం నుంచి హిందీలో ఎంబీబీఎస్ కోర్స్ ప్రవేశపెడతామని మధ్య ప్రదేశ్ సీఎం చేసిన ప్రకటనపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోర్సు పూర్తి చేసేందుకు అవసరమైన పుస్తకాలు, స్టడీ మెటీరియల్ హిందీలో ఎక్కడున్నాయి అంటూ ప్రశ్నిస్తున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికిగాను హిందీలో ఎంబీబీఎస్ కోర్సు నిర్వహిస్తామని మధ్య ప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇటీవల ప్రకటించారు. ప్రయోగాత్మకంగా భోపాల్‌లోని గాంధీ మెడికల్ కాలేజీలో, మొదటి సంవత్సరం విద్యార్థులకు హిందీలోనే కోర్సు నిర్వహించబోతున్నట్లు వెల్లడించారు. దేశంలో మొదటిసారి తాము మాత్రమే హిందీలో మెడికల్ కోర్సు ప్రారంభిస్తున్నామని, మాతృభాషలో ఈ కోర్సు బోధిస్తున్న తొలి రాష్ట్రం తమదే అవుతుందని ఘనంగా ప్రకటించారు చౌహాన్. ఈ కోర్సు కోసం ఫిజియాలజీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ వంటి కోర్సులను హిందీలో రూపొందిస్తున్నట్లు మధ్య ప్రదేశ్ వైద్య విద్యా శాఖ మంత్రి కూడా వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయంపై వైద్య రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: China Spy Ship : స్వదేశానికి చేరుకున్న శాటిలైట్ షిప్

ఎంబీబీఎస్ మొదటి సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే పాఠ్యపుస్తకాలను హిందీలోకి అనువదించారు. వాటిని ఈ నెల 16న భోపాల్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించనున్నారు. ఈ రెండు వైద్య కళాశాలలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేవే. వాటిలో 15శాతం సీట్లను జాతీయ కోట కింద కేటాయించాలి. ఇలాంటి పరిస్థితుల్లో హిందీయేతర రాష్ట్రాలకు సీట్లు వస్తే ఇబ్బంది తప్పదని నిపుణులు పేర్కొంటున్నారు. వైద్య రంగానికి సంబంధించిన జర్నల్స్, ఇంగ్లీష్‍లోనే పబ్లిష్ చేస్తారని, అందువల్ల హిందీలో సరైన పాఠ్యపుస్తకాలు కనుక్కునేందుకే మూడు, నాలుగు సంవత్సరాలు పడుతుందని మాజీ వీసీ డా.భరత్ అన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోకుండా, నిపుణులకే వదిలేయాలని ఆయన సూచించారు.