Terrorist Encounter: జమ్మూ కాశ్మీర్‌లో వాతావరణ విధ్వంసం కారణంగా ప్రతిచోటా జనజీవనం అస్తవ్యస్తమైంది. అకాల వర్షాలతో, అనుకూలంగా లేని వాతావరణాన్ని ఉగ్రవాదులు ఆసరాగా చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే వారి ప్రతి ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ సెక్టర్ పరిధిలోని LOC లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని ఆర్మీ అధికారులు భగ్నం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను టార్గెట్‌గా చేసుకొని సోమవారం ఉగ్రవాదులు చొరబాట్లకు ప్రయత్నిస్తుండగా భారత ఆర్మీ భగ్నం చేసిందని ఉన్నతాధికారులు తెలిపారు.
READ ALSO: Supreme Court : స్థానికత అంశంపై హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు
అప్రమత్తంగా భారత సైన్యం…
ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ X లో ఒక పోస్ట్ చేసింది. “సైనికులు అన్ని ప్రాంతాలలో హై అలర్ట్‌లో ఉన్నారు” అని తెలిపింది. ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ యూనిట్ మొదటి ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశానికి చేరుకున్నప్పుడు, రెండు వైపులా మళ్లీ కాల్పులు ప్రారంభమయ్యాయని ఒక అధికారి తెలిపారు. రెండు వైపుల నుంచి కాల్పులు ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు. భారత ఆర్మీ ఈ ప్రాంతంపై పూర్తి నియంత్రణను కలిగి ఉందని, అక్రమంగా చొరబడటానికి ప్రయత్నించిన పలువురు ఉగ్రవాదులను మట్టుపెట్టడంతో పాటు, ఇంకా ఎంత మంది మిగిలి ఉన్నారో తెలుసుకోడానికి సర్చ్ ఆపరేషన్ చేస్తున్నట్లు తెలిపారు.
అమిత్ షా పర్యటన సందర్భంగా..
గత నెలలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా జమ్మూ పర్యటనకు వచ్చారు. ఈక్రమంలో ఈ ఉగ్రచొరబాటు ప్రయత్నం జరిగింది. సోమవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో బాలకోట్ సాధారణ ప్రాంతంలోని వైట్ నైట్ కార్ప్స్ దళాలు నియంత్రణ రేఖ సమీపంలో అనుమానాస్పద కార్యకలాపాలను గమనించాయి. వెంటనే అప్రమత్తమైన దళాలు చొరబాటుకు యత్నిస్తున్న ఉగ్రవాదులపై కాల్పులు జరిపారు.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉగ్రవాదులు దేశంలోకి చొరబడటానికి ప్రయత్నిస్తున్నారని ఆర్మీ అధికారి తెలిపారు. తెల్లవారుజామున బాలకోట్‌లోని డబ్బి గ్రామం సమీపంలో ఉగ్రవాదుల కార్యకలాపాలు కనిపించాయని, ఆ తర్వాత మొదటి ఎన్‌కౌంటర్ జరిగిందని ఆయన చెప్పారు. ఉగ్రవాదులు కాల్పుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించారని, అయితే అదనపు దళాలను రప్పించి, మొత్తం ప్రాంతాన్ని చుట్టుముట్టి, క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించామని పేర్కొన్నారు. ఈ ఘటనకు కొన్ని రోజుల ముందు, చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది.
