Site icon NTV Telugu

Amit Shah: ప్రజ్వల్ రేవణ్ణపై చర్యలేవి..? కాంగ్రెస్పై అమిత్ షా ప్రశ్నలు

Amit Shah

Amit Shah

మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో లోక్‌సభ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎందుకు చర్యలు తీసుకోలేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహిళలను అవమానిస్తే బీజేపీ సహించదని అన్నారు. కాగా.. ఈ ఘటనలో ఎన్‌డిఎ మిత్రపక్ష అభ్యర్థి ప్రమేయం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఎవరి ప్రభుత్వం ఉందని అమిత్ షా ప్రశ్నించారు.

కర్నాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని అమిత్ షా ప్రశ్నించారు. శాంతిభద్రతలు రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని ఆయన తెలిపారు. మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన కొన్ని వీడియో క్లిప్‌లు గత కొద్ది రోజులుగా హాసన్‌లో మారుమోగుతున్నాయి. కాగా.. ఏప్రిల్ 26న పోలింగ్ జరిగిన హాసన్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ-జేడీ(ఎస్) కూటమి అభ్యర్థి రేవణ్ణ (33) పోటీ చేశారు.

ఈ ఘటనపై ప్రియాంక గాంధీ తమను ప్రశ్నిస్తున్నారని.. అయితే ప్రధాని నరేంద్ర మోడీని లేదా తనను అడగడానికి ముందుగా, ఆమె తన పార్టీ ముఖ్యమంత్రిని అడగాలని షా అన్నారు. ఈ ఘటనపై కర్ణాటక ప్రభుత్వం ఏం చేస్తోంది? ఎందుకు విచారణ లేదు? తాము విచారణకు అనుకూలమని, రేవణ్ణపై చర్యలు తీసుకుంటామని జేడీ(ఎస్) కూడా ప్రకటించిందని తెలిపారు. కాగా.. అంతకుముందు రోజు రేవణ్ణను జేడీ(ఎస్) పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. రేవణ్ణ గురించి మీడియాలో వచ్చిన విషయం చాలా బాధాకరమని, ఏ విధంగానూ సహించలేమని షా అన్నారు. బీజేపీ స్టాండ్ చాలా స్పష్టంగా ఉందని.. మహిళా సాధికారతకి అవమానాన్ని తాము సహించమని అమిత్ షా పేర్కొన్నారు.

Exit mobile version