NTV Telugu Site icon

AMGEN: హైదరాబాద్లో మరో అతి పెద్ద కంపెనీ.. వేలల్లో ఉద్యోగావకాశాలు

Amgen

Amgen

అమెరికాలోనే అతి పెద్ద బయో టెక్నాలజీ కంపెనీ ఆమ్జెన్ (AMGEN) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. హైటెక్ సిటీలో ఆరు అంతస్తుల భవనంలో ఈ సెంటర్ ఉంటుంది. దాదాపు 3 వేల మందికి ఇక్కడ ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ఏడాది చివరి త్రైమాసికం నుంచే కంపెనీ తమ కార్యకలాపాలు ప్రారంభించనుంది. సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎక్స్క్యూటివ్ మిస్టర్ సోమ్ చటోపాధ్యాయతో సమావేశమయ్యారు.

Read Also: Telugu Indian Idol 3: తెలుగు ఇండియన్ ఐడల్ 3కి స్టార్ హీరో

అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో పేరొందిన బయోటెక్‌ సంస్థ హైదరాబాద్‌ను తమ కంపెనీ అభివృద్ధి కేంద్రంగా ఎంచుకోవటం గర్వించదగ్గ విషయమని అన్నారు. బయో టెక్నాలజీ రంగంలో హైదరాబాద్ ప్రాధాన్యం మరింత ఇనుమడిస్తుందని అభిప్రాయపడ్డారు. ప్రపంచ స్థాయి సాంకేతికతతో రోగులకు సేవ చేయాలని కంపెనీ ఎంచుకున్న లక్ష్యం ఎంతో స్పూర్తిదాయకంగా ఉందన్నారు.

40 సంవత్సరాలుగా తమ కంపెనీ బయో టెక్నాలజీ రంగంలో అగ్రగామి సంస్థగా గుర్తింపు సాధించిందని కంపెనీ ఎండీ డాక్టర్ రీస్ అన్నారు. డేటా సైన్స్, అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ కలయికతో కొత్త ఆవిష్కరణలతో మరింత సేవలను అందించేందుకు ఈ సెంటర్ ఏర్పాటు అద్భుతమైన మైలురాయిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. భారత్లో తమ కంపెనీ విస్తరణకు సోమ్ చటోపాధ్యాయను నేషనల్ ఎక్జ్క్యూటివ్గా నియమించినట్లు చెప్పారు.

Read Also: YS Jagan: హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్తాం.. సీతారాంపురం ప్రజలను కాపాడుకుంటాం..

పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ఆమ్‌జెన్‌ ఇండియా హైదరాబాద్ ను కేంద్రంగా ఎంచుకోవటం ఆనందంగా ఉందన్నారు. ఈ నిర్ణయం తెలంగాణలో అందుబాటులో ఉన్న ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ పర్యావరణ వ్యవస్థను చాటిచెపుతుందన్నారు. కంపెనీ విస్తరణకు తగినంత మద్దతు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆమ్ జెన్ కంపెనీ ప్రపంచంలో వంద దేశాల్లో విస్తరించి ఉంది. దాదాపు 27 వేల మంది ఉద్యోగులున్నారు.

Show comments