NTV Telugu Site icon

US: అమెరికాలో ఘోర ప్రమాదం.. కంటైనర్ షిప్ ఢీకొని కూలిన బ్రిడ్జి

Us Bridge

Us Bridge

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది. మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లోని ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జి కుప్ప కూలిపోయింది. పాతాప్‌స్కో నదిలో ఒక పెద్ద కంటైనర్ షిప్‌ ఢీకొనడంతో నిమిషాల్లోనే వంతెన కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు.. కొన్ని కార్లు, డజన్లు కొద్ది మనుషులు నదిలో పడిపోయినట్లు తెలుస్తోంది. వారి కోసం అధికారులు గాలిస్తున్నట్లు సమాచారం. మంగళవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.

ఓ భారీ షిప్ వెళ్లాల్సిన దారిలో కాకుండా.. బ్రిడ్జి ఫిల్లర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా బ్రిడ్జి సెకన్ల కాలంలో కూలిపోయింది. ప్రమాద సమయంలో వంతెనపై ఉన్న వాహనాలు నదిలో పడిపోయాయి. అంతేకాకుండా ఓడలో కూడా మంటలు చెలరేగాయి. అనంతరం షిప్ కూడా నదిలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. దాదాపు 20 మందికి పైగా వ్యక్తులు నదిలో పడిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న అధికారులు సంఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాదం తర్వాత రెండు వైపుల నుంచి అన్ని మార్గాలను మూసివేసి ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు మేరీల్యాండ్ ట్రాన్స్‌పోర్టేషన్ అథారిటీ తెలిపింది. ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలను మాత్రం అధికారులు ఇంకా వెల్లడించలేదు. అయితే వాహనాలు నీటిలో మునిగి పోవడంతో పలువురు మృతి చెందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Prithviraj Sukumaran: ”ది గోట్ లైఫ్” 16 ఏళ్ళ ప్రయాణం.. 31 కిలోల బరువు తగ్గా: హీరో ఇంటర్వ్యూ

ఇదిలా ఉంటే బ్రిడ్జి కూలిపోతున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బ్రిడ్జిని ఢీకొన్న నౌక సింగపూర్‌కు చెందిన ‘డాలీ’గా గుర్తించారు. ఇది శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తున్నట్టు తెలుస్తోంది. కాగా 1977లో మేరీల్యాండ్‌లోని బాల్టిమోర్‌లో ఫ్రాన్సిస్ స్కాట్ కీ వంతెనను నిర్మించారు. ఫ్రాన్సిస్ స్కాట్ కీ అనే వ్యక్తి అమెరికాకు జాతీయ గీతాన్ని రాసిన వ్యక్తి. అతని పేరే ఈ బ్రిడ్జికి పెట్టారు.

ఇది కూడా చదవండి: SRH vs MI: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో మ్యాచ్‌.. ముంబై ఇండియన్స్‌కు భారీ ఎదురుదెబ్బ!