Ambulance Incident : పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలో గురువారం ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అంబులెన్స్ డ్రైవర్ ఎక్కువ డబ్బు డిమాండ్ చేయడంతో విస్తుపోయిన కొడుకు తన తల్లి మృతదేహాన్ని తన భుజంపై మోసుకెళ్లిన సంఘటన జరిగింది. ఈ కేసు వెలుగులోకి రావడంతో మూడు వేల రూపాయలు అదనంగా డబ్బులు డిమాండ్ చేసిన డ్రైవర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశ్వజిత్ మహతో ఆదేశించారు. దీనిపై పూర్తిస్థాయి విచారణకు కూడా ఆదేశించారు. లక్ష్మీరాణి దేవాన్ అనే మహిళ అస్వస్థతకు గురై జల్‌పాయ్‌గురి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరింది. ఆమె గురువారం చనిపోయింది. మృతదేహాన్ని తరలించేందుకు స్థానిక అంబులెన్స్ డ్రైవర్ ఆమె కొడుకును రూ.3000 డిమాండ్ చేశాడు.
Read Also: Delhi Mayor Polls: మేయర్ పీఠం కోసం కొట్లాట.. తామే దక్కించుకుంటామని బీజేపీ ధీమా
రోజు వారీ కూలీ చేసుకునే అతడు ఇవ్వలేకపోవడంతో.. తన తల్లి మృతదేహాన్ని తరలించేందుకు డ్రైవర్ నిరాకరించాడు. దీంతో చేసేదేంలేక తండ్రి సాయంతో తల్లి మృతదేహాన్ని భుజాన వేసుకుని ఉన్నాడు. జల్‌పాయ్‌గురి నుండి వారి సొంత ఊరు క్రాంతికి దాదాపు యాభై కిలోమీటర్లు నడక ప్రారంభించారు. ఉదయం ఏడు గంటలకు మృతదేహాన్ని భుజాలపై మోసుకెళ్తున్న దృశ్యాన్ని చూసిన పలువురు కంటతడిపెట్టుకున్నారు. కొన్ని ప్రభుత్వేతర సంస్థల సహకారంతో మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించి దహన సంస్కారాలు చేసినప్పటికీ ఘటన వెలుగులోకి రావడంతో అధికార యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. పోలీసు సూపరింటెండెంట్ ఆదేశాల మేరకు, జల్‌పాయ్‌గురి జిల్లా పోలీసులు స్థానిక సదర్ ట్రాఫిక్ కార్యాలయంలో ప్రైవేట్ వాహన డ్రైవర్లకు అవగాహన శిబిరాన్ని నిర్వహించారు. అవగాహన శిబిరంలో డ్రైవర్లు మరింత మానవత్వంతో ప్రవర్తించాలని జల్పాయిగురి అదనపు పోలీసు సూపరింటెండెంట్ సందీప్ సేన్ కోరారు.