Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!

Ambati Rayudu

Ambati Rayudu

Ambati Rayudu: భారత క్రికెట్ చరిత్రలో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. వీరి ముగ్గురి నాయకత్వంలోనూ ఆడిన అతికొద్ది మంది భారత క్రికెటర్లలో తెలుగు తేజం అంబటి రాయుడు ఒకరు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న రాయుడు, ఈ ముగ్గురు దిగ్గజాల కెప్టెన్సీ శైలి, వారి ఆలోచనా విధానాల మధ్య ఉన్న ప్రధాన తేడాలను ఎంతో ఆసక్తికరంగా వివరించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది.

ముందుగా సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీ గురించి రాయుడు మాట్లాడుతూ.. సచిన్ ఒక గొప్ప జీనియస్ అని పేర్కొన్నారు. ఏదైనా ఒక పని చేయాలంటే ఆయన మెదడులో ఒకేసారి వంద రకాల ఆలోచనలు నడుస్తుంటాయని, అంతటి మేధావి స్థాయిలో ఉన్న వ్యక్తి ఒక సాధారణ ఆటగాడి స్థాయికి దిగి విషయాలను అర్థమయ్యేలా వివరించడం కొంత కష్టమవుతుందని అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఆ విషయంలోనే సచిన్‌కు కెప్టెన్సీ కాస్త కష్టతరంగా మారిందని రాయుడు తన అభిప్రాయాన్ని తెలిపారు.

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వ లక్షణాలను రాయుడు ప్రత్యేకంగా ప్రశంసించారు. ఒక సాధారణ ఆటగాడి సామర్థ్యం ఏంటి? అతను ఏం చేయగలడు? అతని నుంచి అత్యుత్తమ ప్రదర్శనను ఎలా రాబట్టుకోవాలి? అనే విషయాలపై ధోనీకి పూర్తి స్పష్టత ఉంటుందని తెలిపారు. ఎదుటివారి బలాలను గుర్తించి, వారితో సమర్థవంతంగా పని చేయించడంలో ధోనీ దిట్ట అని రాయుడు వివరించారు. అలాగే విరాట్ కోహ్లీ విషయానికి వస్తే.. ఆయనకు ఏదైనా ఒక పని అప్పగిస్తే దానిని కోహ్లీ కంటే అద్భుతంగా మరెవరూ చేయలేరని రాయుడు కొనియాడారు. అయితే, జట్టులోని ప్రతి ఒక్కరూ తనలాగే ఆడాలని, తన స్థాయిలోనే కష్టపడాలని కోహ్లీ ఆశిస్తారని, కానీ అందరు ఆటగాళ్లు ఒకేలా ఉండరు కాబట్టి కెప్టెన్సీ విషయంలో కోహ్లీ అక్కడ కొంత ఇబ్బంది పడ్డారని అభిప్రాయపడ్డారు.

ఈ ముగ్గురు దిగ్గజాల నాయకత్వ శైలిని ఒక్క మాటలో వివరిస్తూ.. “మనం స్వయంగా ఒక పని చేయాలంటే విరాట్ కోహ్లీలా చేయాలి, అదే ఇతరులతో పని చేయించాలంటే మాత్రం ధోనీలా చేయించాలి” అని రాయుడు చెప్పారు. వీరు ముగ్గురూ గొప్ప ఛాంపియన్లని, ఎవరికి వారే ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.