Vijayawada to Amaravati: విజయవాడ నుంచి అమరావతికి రాజబాట.. రూ.1000 కోట్లతో మరో బ్రిడ్జి..

Vijayawada To Amaravathi

Vijayawada To Amaravathi

విజయవాడ నుంచి అమరావతికి మరో రాజబాటకు అడుగులు పడుతున్నాయి.. కృష్ణా నదిపై అంతర్జాతీయ ప్రమాణాలతో , సిగ్నేచర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.. కేవలం రాకపోకలకు మాత్రమే కాకుండా.. అమరావతికి, ఐకానిక్ ల్యాండ్‌మార్క్‌గా నిలిచేలా ఈ వంతెనను తీర్చిదిద్దాలని భావిస్తోంది ప్రభుత్వం.. 1000 కోట్ల ప్రతిపాదనతో రెడీ అవుతున్న ,ఈ రాజమార్గం ప్రత్యేకత ఏంటి..? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇప్పటివరకు విజయవాడ నుంచి, అమరావతిలోకి రావాలంటే ,వారధి లేదా, ప్రకాశం బ్యారేజీ మీదుగా రాజధాని ప్రాంతానికి చేరుకోవాలి. పెరుగుతున్న వాహనాలతో, ఈ బ్రిడ్జిలపై ప్రయాణ సమయంలో, తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటివరకు అయితే కొంత పర్లేదు గాని.. మరొక రెండు మూడు సంవత్సరాలు గడిస్తే , అమరావతిలో పూర్తిస్థాయిలో రాకపోకలు ప్రారంభమైతే, ఈ రెండు బ్రిడ్జిలు మీద రాకపోకల వల్ల ట్రాఫిక్ తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో.. వెయ్యి కోట్లతో భారీ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నడుం బిగించింది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో విజయవాడ నుంచి రాజధాని అమరావతికి రాకపోకలను మరింత సులభతరం చేయడంతో పాటు.. రాజధాని అభివృద్ధిలో ఈ బ్రిడ్జిని కీలక మౌలిక వసతిగా మార్చాలని ప్రభుత్వం భావిస్తుంది. రాజధాని అవసరాలతో పెరిగిన ట్రాఫిక్ తో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు, ఇబ్బందులు తొలగించడంతోపాటు, పర్యాటక ప్రాజెక్టుగా కూడా దీన్ని మార్చాలన్న ఆలోచనతో అధికారులు ప్రణాళికలు వేస్తున్నారు అని సమాచారం.

ప్రతిపాదిత సిగ్నేచర్ ఐకానిక్, బ్రిడ్జి ప్రకాశం బ్యారేజీ, రైల్వే బ్రిడ్జిల మధ్య ప్రాంతంలో నిర్మించేలా ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. సీతానగరం ఘాట్‌ వైపు నుంచి కనకదుర్గ ఫ్లైఓవర్‌ దిశగా.. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డుతో అనుసంధానం కల్పించేలా ప్రాజెక్టును ప్రతిపాదించారు.

అమరావతి అభివృద్ధిలో ఒక ల్యాండ్‌మార్క్‌గా నిలిచేలా డిజైన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. తెలుగు సంస్కృతికి ప్రతీకగా నిలిచే కూచిపూడి నృత్య భంగిమల స్ఫూర్తితో, ఐకానిక్ డిజైన్ రూపొందించే అవకాశంపైనా చర్చ జరుగుతోంది. పర్యాటకంగా కూడా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేసేందుకు, ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి సమీకరించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఫీజిబిలిటీ రిపోర్ట్, డీపీఆర్‌ తయారీ కోసం కన్సల్టెంట్ ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. రాజధాని కనెక్టివిటీని పెంచడంతో పాటు.. అమరావతి స్కైలైన్‌లో మరో ప్రత్యేక నిర్మాణంగా ఈ బ్రిడ్జి నిలిచేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.