వారిద్దరూ వరుసకు బావా మరదళ్లు. అయినంత మాత్రాన వివాహేతర బంధం అంటగట్టారు. అంతే కాదు.. వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్న తమ భాగస్వాముల నుంచి సూటిపోటి మాటలు ఎదుర్కున్నారు. చిత్ర హింసలు అనుభవించారు. దీంతో జీవితం మీద విరక్తి చెంది కలిసే ఆత్మహత్య చేసుకున్నారు. బంధుత్వం, ప్రేమ, సమాజపు ఒత్తిళ్లు.. ఈ మూడింటి మధ్య ఊగిసలాడుతూ, ఇద్దరు వ్యక్తులు బలవన్మరణానికి పాల్పడ్డారు.. ఈ ఘటన నల్లగొండ జిల్లా బీబీనగర్‌లో కలకలం రేపింది..
ఇక్కడ చూడండి.. ఈ వ్యక్తి పేరు బంధబాల సుధాకర్.. ఈ మహిళ పేరు పాసాల సుష్మిత. ఇద్దరూ వరుసకు బావా మరదళ్లు అవుతారు. కానీ ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో పెళ్లిళ్లు అయ్యాయి. కానీ ఇద్దరి జీవితాల్లో తమ భాగస్వాముల నుంచి ఈసడింపులు.. వివాహేతర బంధం ఉందన్న కారణంతో వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఇద్దరూ మనస్తాపం చెందారు.. ఇటీవల వారు సన్నిహితంగా ఉండటం వల్ల వివాహేతర బంధం కొనసాగుతుందన్న ఆరోపణలతో ఇరు కుటుంబాల మధ్య తగాదాలు చెలరేగాయి. ఈ కారణంగా సుష్మిత భర్త ధనరాజ్ ఆమెపై నల్లగొండ జిల్లాలోని కేతేపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదు చేశాడు. తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన సుధాకర్, సుష్మిత రెండు రోజుల క్రితం బీబీనగర్ మండలంలోని కొండమడుగు శివారులో రాగల రిసార్ట్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నారు…
READ MORE: Banakacherla Project: ఏపీకి షాకిచ్చిన కేంద్రం..! బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వెనక్కి ..
ఆదివారం మధ్యాహ్నం సమయంలో సుధాకర్ తన బావ రంజిత్‌కు వీడియో కాల్ చేసి, ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుంటున్నామని తెలిపాడు. అయితే, తమ స్థానం మాత్రం వెల్లడించలేదు. దీంతో రంజిత్ తనకు సమీపంలో ఉన్న ఉప్పల్ పోలీసుల సహకారంతో బీబీనగర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అటు సుష్మిత కూడా తన ఆత్మహత్యకు గల కారణాలు వివరిస్తూ సెల్ఫీ వీడియో చేశారు. అందులో తన బాధలను వివరించారు. ఆ వీడియోను భర్త ధనరాజ్‌కు పంపించారామె. అంతే కాదు వీరిద్దరూ వేర్వేరుగా సూసైడ్ లెటర్స్ రాశారు.. మరోవైపు సుష్మిత భర్త ధనరాజు ఉప్పల్ పోలీసులను ఆశ్రయించారు. సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా పోలీసులు కనుక్కొని సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే వారిద్దరు పురుగుల మందు తాగి మృతి చెంది ఉండడంతో భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వివాహేతర బంధం ఉందన్న కారణంతో ఇదర్నీ అవమానించారు. దీంతో ఆ బాధను తట్టుకోలేక ఇద్దరూ ఆత్మార్పణ చేసుకున్నారు..
