Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!

  • తమిళనాడులోని సేలం జిల్లా మల్లముపంపట్టి గ్రామంలో..
  • ప్రత్యేకమైన ఏలియన్ ఆలయం
  • ఆలయంలో 11 అడుగుల లోతులోని భూగర్భ గర్భగుడిలో "ఏలియన్ గాడ్" విగ్రహం..
Alien Temple

Alien Temple

Alien Temple: భారతదేశంలో ఎన్నో పురాతన, విశిష్ట ఆలయాలు ఉన్నాయి. అయితే తమిళనాడులోని ఒక ఆలయం మాత్రం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దేవుళ్లతో పాటు గ్రహాంతరవాసి (Alien) విగ్రహానికి పూజలు జరిగే ఈ ఆలయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సంప్రదాయ ఆధ్యాత్మికతకు కొత్త ఆచారాలను జోడిస్తూ నిర్మించిన ఈ ఆలయం పర్యాటకులు, భక్తులు, ఆసక్తి గల సందర్శకులను ఆకర్షిస్తోంది.

తమిళనాడులోని సేలం జిల్లా మల్లముపంపట్టి (Mallamupampatti) గ్రామంలో ఈ ప్రత్యేక ఆలయం ఉంది. స్థానిక ఆధ్యాత్మిక గురువు లోగనాథన్ (సిద్ధర్ పాకియా) ఈ ఆలయాన్ని నిర్మించారు. భూమికి బయట కూడా జీవం ఉందని, విశ్వంలోని అన్ని జీవరాశులు పరస్పరం అనుసంధానమై ఉన్నాయని ఆయన నమ్మి.. ఆ భావనను ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఆలయాన్ని ఏర్పాటు చేసారంట.

ఈ ఆలయంలో 11 అడుగుల లోతులోని భూగర్భ గర్భగుడిలో ఉంటుంది “ఏలియన్ గాడ్” విగ్రహం. పొడవాటి తల, పెద్ద నల్లని కళ్లతో కనిపించే ఈ విగ్రహం గ్రే ఏలియన్ ఆకృతిని పోలి ఉంటుంది. ఆలయ వ్యవస్థాపకుడు సిద్ధర్ పాకియా అభిప్రాయం ప్రకారం.. గ్రహాంతరవాసులు అత్యున్నత స్థాయి జీవులని నమ్ముతారు. వారు మానవాళికి శాంతి, సామరస్యం, ఆధ్యాత్మిక అభివృద్ధి దిశగా మార్గనిర్దేశం చేయగలరని ఆయన నమ్మకం. అలాగే, శివుడి తొలి సృష్టుల్లో గ్రహాంతరవాసులు కూడా ఉన్నారని, వారికి అసాధారణ శక్తులు ఉన్నాయని పేర్కొంటారు. ప్రాచీన భారతీయ గ్రంథాల్లో పేర్కొన్న విమానాలు, దివ్య లోకాల జీవులు వంటి అంశాలు ఇతర గ్రహాల జీవులతో సంబంధాలకు సంకేతాలు కావచ్చని ఆయన వ్యాఖ్యానిస్తుంటారు. అయితే, ఈ అభిప్రాయాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇవి పూర్తిగా వ్యక్తిగత ఆధ్యాత్మిక విశ్వాసాలు, వ్యాఖ్యానాలుగా మాత్రమే పరిగణించబడుతున్నాయి.

ఈ భూగర్భ ఆలయంలో ఏలియన్ విగ్రహంతో పాటు శివుడు, పార్వతీ దేవి, మురుగన్ (సుబ్రమణ్య స్వామి), కాళీమాత, వారాహి అమ్మవారు వంటి హిందూ దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం శాస్త్రీయంగా ఏలియన్ల ఉనికిని నిరూపించదు. అయితే ఆధ్యాత్మిక విశ్వాసాలు, పురాణ వ్యాఖ్యానాలు, విశ్వ రహస్యాలపై ఆసక్తి ఉన్నవారిని ఆకర్షించే అరుదైన ఆలయంగా ప్రత్యేక గుర్తింపు పొందింది.