Chandrababu: టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. పొత్తులో భాగంగా తెనాలి సీటును జనసేన నేత నాదెండ్ల మనోహర్‌కు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెనాలి టీడీపీ ఇన్‌ఛార్జ్ ఆలపాటి రాజాను ఇంటికి పిలిపించుకుని చంద్రబాబు ఆయనతో మాట్లాడారు. పొత్తులో భాగంగా జరిగిన తెనాలి సీటు సర్దుబాటును అర్ధం చేసుకోవాలని చంద్రబాబు ఆలపాటి రాజాకు నచ్చజెప్పారు. పొత్తుల్ని, పార్టీ నిర్ణయాల్ని గౌరవించే వ్యక్తిని తానని చంద్రబాబుతో రాజా అన్నట్లు తెలిసింది. రాజకీయ భవిష్యత్తు తాను చూసుకుంటానని, తగు ప్రత్యామ్నాయం కల్పిస్తానని ఆలపాటి రాజాకు చంద్రబాబు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో భేటీ పట్ల ఆలపాటి రాజా సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
Read Also: Chellluboina Venugopal: టీడీపీ-జనసేన ఉమ్మడి జాబితాపై మంత్రి చెల్లుబోయిన సంచలన వ్యాఖ్యలు
ఇదిలా ఉండగా.. బొడ్డు వెంకట రమణ చౌదరితోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. బీజేపీ రాజమండ్రి ఎంపీ స్థానాన్ని ఆశించకుంటే ఆ స్థానాన్ని కేటాయించే అంశంపై పరిశీలిద్దామని చంద్రబాబు ఆయనతో చెప్పినట్లు తెలిసింది. చంద్రబాబుతో భేటీపై బొడ్డు వెంకటరమణ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. పీలా గోవింద్, బీకే పార్ధసారధి తదితర సీటు దక్కని నేతలకు కూడా చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ, రేపట్లో చంద్రబాబుని సీటు రాని ఆశావహులు కలవనున్నారు.