NTV Telugu Site icon

Akhilesh Yadav-World Cup 2023: అక్కడ ఆడితే భారత్ ప్రపంచకప్‌ గెలిచేది.. అఖిలేశ్‌ యాదవ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు!

Akhilesh Yadav World Cup 2023

Akhilesh Yadav World Cup 2023

Akhilesh Yadav React on World Cup 2023 Final: వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో భారత్‌ ఓటమిని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సొంత గడ్డపై కప్ చేజారడంతో భారత అభిమానులు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇందులో సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కూడా ఉన్నారు. తాజాగా అఖిలేశ్‌ ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైనల్‌ను గుజరాత్‌లో కాకుండా.. లక్నోలో నిర్వహిస్తే ఆస్ట్రేలియాపై భారత్ గెలిచి ఉండేదని బీజేపీని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఎస్పీ చీఫ్ అఖిలేశ్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. వన్డే ప్రపంచకప్‌ 2023 ఫైనల్‌పై స్పందించారు. ‘ప్రపంచకప్‌ 2023 ఫైనల్ మ్యాచ్‌ గుజరాత్‌లో కాకుండా లక్నోలో జరిగి ఉంటే.. భారత జట్టుకు మంచి ఆశీర్వాదం లభించేది. మహా విష్ణువు, అటల్‌ బిహారీ వాజ్‌పేయి ఆశీస్సులు వారికి లభించేవి. దీంతో భారత జట్టు కచ్చితంగా కప్ గెలిచేది’ అని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. ప్రస్తుతం అఖిలేశ్‌ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి.

Also Read: World Cup 2023: భారత్ బాగా ఆడలేదు.. నిజం ఒప్పుకోవాల్సిందే: గౌతమ్ గంభీర్

గతంలో అఖిలేశ్‌ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీ ప్రభుత్వం లక్నోలో మైదానాన్ని నిర్మించి.. ఎకనా స్టేడియం అని పేరు పెట్టింది. మహా విష్ణువుకు ఉన్న పేర్లలో ‘ఎకానా’ ఒకటి అన్న విషయం తెలిసిందే. 50,000 మంది సీటింగ్ కెపాసిటీతో ఎకానా స్టేడియం భారతదేశంలో మూడవ అతిపెద్ద క్రికెట్ మైదానంగా ఉంది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం 2018లో ఈ స్టేడియం పేరును ‘భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా క్రికెట్ స్టేడియం’గా మార్చింది.

Show comments