Site icon NTV Telugu

Story Board: NCP భవిష్యత్తు ఏంటి..?.. పవార్ శకం ముగుస్తుందా..?

Sb

Sb

Story Board: అజిత్ పవార్ కేవలం మహారాష్ట్ర డిప్యూటీ సీఎం మాత్రమే అయితే ఇంత చర్చ అనవసరం లేదు. కానీ ఆయన ఎన్సీపీకి అధినేతగా కూడా ఉన్నారు. అలాగే ఎవరేమనుకున్నా.. పవార్ కుటుంబ రాజకీయానికి కూడా కేంద్ర బిందువుగా ఉన్నారు. మహారాష్ట్ర సీఎం కావడమే జీవితకాల లక్ష్యమన్న అజిత్.. చివరకు ఆ కోరిక తీర్చుకోకుండానే.. డిప్యూటీ సీఎంగా మృత్యువాత పడ్డారు. ఈ విషాదమే ఇప్పుడు ఎన్సీపీ భవిష్యత్తు ఏంటనే చర్చకు తెరలేపింది.

Read Also: Sai Abhyankkar : తమిళ సెన్సేషన్ సాయి అభ్యంకర్.. ఇక వాళ్ళు దుకాణం సర్దుకోవాల్సిందే.

శరద్ పవార్ రాజకీయ వారసుడిగా పాలిటిక్స్‌ లోకి వచ్చిన అజిత్‌ పవార్ తర్వాత.. తనదైన శైలిలో బలమైన నేతగా ఎదిగారు. బాబాయ్ దగ్గరే రాజకీయ పాఠాలు నేర్చుకుని.. చివరకు ఆ బాబాయ్‌నే నిస్సహాయుడిగా మార్చేస్తూ.. పార్టీని, ఆ పార్టీ గుర్తును గుప్పిటపట్టారు. ఎప్పటికప్పుడు రాజకీయ ఎత్తులు పైఎత్తుల్లో ఆరితేరిన అజిత్ పవార్.. వివిధ పార్టీల ప్రభుత్వాల్లో ఆరుసార్లు డిప్యూటీ సీఎంగా పనిచేసి రికార్డు సృష్టించారు. గ్రామీణ మహారాష్ట్ర, సహకార రంగంపై గట్టి పట్టున్న అజిత్ పవార్.. ఎన్సీపీ క్షేత్రస్థాయి కార్యకర్తలతో బలమైన సంబంధాలు పెట్టుకున్నారు. శరద్ పవార్ తరహాలోనే సహకార రంగం నుంచే రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన అజిత్.. బారామతిని రాజకీయ కార్యక్షేత్రంగా మార్చుకున్నారు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో భార్య సునేత్రను ఓడించారని బారామతి ప్రజలపై అలిగిన అజిత్.. తర్వాత మనసు మార్చుకుని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు.

Read Also: CM Revanth Reddy: హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ లో సీఎం రేవంత్ రెడ్డి బిజిబిజీ!

శరద్ పవార్ ఢిల్లీ రాజకీయాలపై ఫోకస్ పెడితే.. అజిత్ మహారాష్ట్రకే పరిమితమై ఎన్సీపీ బరువు బాధ్యతలు చూసుకున్నారు. పార్టీ బలం తగ్గకుండా చూశారు. అలుపెరగకుండా పనిచేసే నేతగా, సమర్థుడిగా పేరు తెచ్చుకున్నారు. కానీ కొంతకాలం తర్వాత ఎంత కష్టపడ్డా తగిన ప్రతిఫలం దక్కలేదనే భావనకు వచ్చారు. తర్వాత పలుమార్లు బహిరంగంగానే శరద్‌ పవార్‌ను ధిక్కరించారు. 2004లో ఎన్సీపీకి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు వచ్చినా.. మిత్రపక్షం కాంగ్రెస్‌కు సీఎం సీటు ఇవ్వడాన్ని గట్టిగా వ్యతిరేకించిన అజిత్.. చివరకు డిప్యూటీ సీఎం పదవితో సరిపెట్టుకున్నారు. ఎప్పటికప్పుడు రాజకీయంగా ఉన్నతస్థానాలకు ఎదగాలనే లక్ష్యంతో.. కప్పదాట్లకూ వెనుకాడకపోయినా.. ఆయన మహరాష్ట్ర సీఎం మాత్రం కాలేకపోయారు. కాంగ్రెస్, శివసేన, బీజేపీ ప్రభుత్వాల్లో డిప్యూటీసీఎంగా చేసిన అరుదైన రికార్డు అయితే అజిత్ సొంతమైంది. అజిత్ పవార్ కప్పదాట్లపై ఎలాంటి అభిప్రాయాలున్నా.. ఆయనా రాజకీయ వ్యూహాల గురించి మాత్రం ప్రత్యర్థులు కూడా చెప్పుకుంటారు. ఆస్థాయిలో మహా రాజకీయాలపై అజిత్ పట్టు సాధించారు.

Read Also: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు బంగారం, గోల్డ్ ధరలు ఇలా..!

బారామతి ప్రజలతో బలమైన సంబంధాలున్న అజిత్.. కొన్నిసార్లు వివాదాల్లో చిక్కుకున్నా.. ప్రతిసారీ చెక్క చెదరకుండానే బయటపడ్డారు. మొన్నటికి మొన్న కుమారుడు పార్థ్ పవార్ భూకుంభకోణం ఆరోపణలతో ఇరుకునపడ్డప్పుడు.. అజిత్‌ కూ సమస్యలు తప్పలేదు. కానీ మొన్నటి ఎన్నికల్లో మాత్రం దీని కారణంగా అజిత్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. శరద్ పవార్‌ను ధిక్కరించి ఎన్సీపీని చీల్చాక.. లోక్‌సభ ఎన్నికల్లో సరైన ఫలితాలు రాకపోయినా అజిత్ డీలా పడలేదు. మళ్లీ గట్టిగా పనిచేసి అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన సీట్లు సాధించి శరద్ పవార్‌ పై పైచేయి సాధించారు. ఆ తర్వాత మహాయుతి సర్కారులో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు.

అజిత్ పవార్ రాజకీయ అనుభవం కూటమి సర్కారుకు కీలకంగా ఉపయోగపడుతోందని బీజేపీ నేతలు కూడా అభిప్రాయపడ్డారు. కొన్నిసార్లు సర్కారుకు సమస్యలొస్తే.. అజితే ట్రబుల్ షూటర్‌గా పనిచేశారు. అందుకే అజిత్ మృతి తనకు వ్యక్తిగతంగా నష్టమని సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా మనస్తాపానికి గురయ్యారనే చర్చ జరుగుతోంది. రాజకీయంగా ఎలాంటి పరిస్థితులున్నా.. వాటిని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో దిట్ట అయిన అజిత్ పవార్.. మహారాష్ట్ర రాజకీయాలపై పూర్తిస్థాయిలో పట్టు సాధించాక.. చనిపోవటం.. ఎన్సీపీకి తీరని లోటే అనే అభిప్రాయాలున్నాయి.

ప్రస్తుతం అజిత్‌ గ్రూపులో 41 మంది ఎమ్మెల్యేలున్నారు. మహారాష్ట్ర నాలుగు స్తంభాలాటలో ఇది చిన్న సంఖ్యేం కాదు. ఇప్పుడు అందరి దృష్టి అజిత్ వర్గం ఎమ్మెల్యేలపై పడింది. వీరంతా వచ్చే ఎన్నికలదాకా.. ఒక్కతాటిపై ఉంటారా.. ఏ పార్టీ అయినా వీరిని లాగేస్తుందా అనే చర్చ మొదలైపోయింది. దీంతో అప్రమత్తమైన ఎన్సీపీ సీనియర్ నేతలు అజిత్ భార్య సునేత్రను డిప్యూటీసీఎంగా చేయాలని చూస్తున్నారు. అజిత్ నియోజకవర్గం బారామతిలో ఉపఎన్నికల్లో సునేత్రను బరిలో దించాలని భావిస్తున్నారు. పనిలోపనిగా సీనియర్ నేత ప్రపుల్ పటేల్‌ను పార్టీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కొత్త నాయకత్వం కుదురుకోగలదా..? ఎమ్మెల్యేలు అజిత్‌కు చూపిన విధేయత కొత్త నేతకు చూపుతారా..? అనేవి ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్నలే. తమిళనాడు జయ మరణం తర్వాత అన్నాడీఎంకేని పరోక్షంగా నడిపినట్టుగా ఇప్పుడు ఎన్సీపీని కూడా బీజేపీ నడుపుతుందనే వాదన కూడా ఉంది. అటు ఎన్సీపీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ గూటికి చేరటానికి రెడీగా ఉంటారని భావిస్తున్నారు. కొందరైతే ఎన్సీపీకి పేరుకు ఎవరు అధ్యక్షుడిగా ఉన్నా.. ఎవరు నేతృత్వం వహించినా.. వారిని బీజేపీయే నడిపించబోతోందని కూడా అంటున్నారు. కానీ ఇవన్నీ ఇప్పటికీ ఊహాగానాలే. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

రాజకీయ చదరంగాన్ని కాసేపు పక్కనపెడితే.. అజిత్‌కు ప్రజలు, అభివృద్ధి విషయంలో కొన్ని ఆలోచనలు, నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన పనితీరు గురించి బారామతి ప్రజలకు పూర్తి అవగాహన ఉంది. అజిత్‌కు పట్టున్న ప్రాంతాల్లో కూడా ప్రజలకు ఆయన మనస్తత్వం బాగా తెలుసు. అజిత్ అంతిమదర్శనం కోసం వచ్చిన జనాన్ని చూస్తే.. ఆయన ప్రజాదరణ స్థాయి ఏంటో అర్థమవుతుంది. ఇక్కడ కేవలం కొత్త నేత రావడమే కాదు.. వారిని ప్రజలు అంగీకరించడం కూడా కీలకమే. వారు కాదంటే ఎవరూ చేసేది ఏమీ ఉండదు. తమిళనాడులో కూడా అన్నాడీఎంకేపై తమ పరోక్ష పెత్తనం జనం ఇష్టపడటం లేదని తెలిసే ఆ పార్టీని బీజేపీ వదిలేసింది. ఆ అనుభవం ఇంకా పచ్చిగానే ఉండగా.. మహారాష్ట్రలో అదే పని చేస్తుందా.. లేదా అనే సందేహాలూ లేకపోలేదు. అంతకంటే పార్టీ విలీనానికే బీజేపీ మొగ్గుచూపవచ్చనే చర్చ జరుగుతోంది. అదంత తేలికా అనేది మరో కోణం.

ఎన్సీపీ మూలపురుషుడు శరద్ పవార్ ఇప్పటికే రాజకీయంగా అంత యాక్టివ్‌గా ఉండటం లేదు. రాజ్యసభ సభ్యత్వం కూడా ఏప్రిల్ వరకే ఉంది. తాను స్థాపించిన పార్టీ కళ్ల ముందే రెండు ముక్కలైనా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన శరద్.. ఇప్పుడు అజిత్ వర్గాన్ని ఆహ్వానించే ఆసక్తి కూడా చూపించడం లేదు. తన అనారోగ్యంతో.. ఉన్న పార్టీని నడపటమే కష్టంగా ఉందని ఆయన భావిస్తున్నారు. కాబట్టి ఎన్సీపీ భవిష్యత్తు విషయంలో శరద్ పాత్ర దాదాపుగా లేనట్టే అంటున్నారు. పోనీ శరద్ కూతురు సుప్రియాసూలే ఉందిగా అనుకున్నా.. ఆమెకు పార్టీని నడిపే సత్తా లేదని ఇప్పటికే తేలిపోయింది. ఏదో ఢిల్లీకి పరిమితమై రాజకీయం చేయటమే కానీ.. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి జవసత్వాలు అందించే స్థాయి నేత ఆమె కాదని శరద్ కూడా ముందే గ్రహించారు. అసలు మొదట్లో సుప్రియ రాజకీయాలపై ఆసక్తి కూడా చూపలేదు. అందుకే అజిత్‌ను శరద్‌ ఎంకరేజ్ చేశారని చెబుతారు. కానీ మధ్యలో సుప్రియ ఎంపీ కావడం.. తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో వేలుపెట్టడమే అజిత్‌కు ఆగ్రహం తెప్పించింది. సుప్రియను హస్తినకు పరిమితం చేస్తానన్న మాట తప్పారనే కారణంతోనే ఆయన బాబాయ్‌కు గుడ్‌బై చెప్పేశారు. మరి ఎన్సీపీ ఎమ్మెల్యేలు సొంత నిర్ణయం తీసుకుంటారా.. కొన్నాళ్లు ఏం జరుగుతుందో చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తారా అనేది.. పార్టీ భవిష్యత్తును తేల్చే అవకాశం ఉంది.

ఎన్సీపీ భవిష్యత్తుకు నాయకత్వమే కీలకం. సాధారణంగా వారసులుంటే ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. కానీ అజిత్‌కు వారసులున్నా.. వారికి సత్తా లేదనే చర్చతో.. కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి. అజిత్ భార్యగా కంచుకోట బారామతిలో ఓడిన సునేత్ర ఏమాత్రం పార్టీని బలోపేతం చేయగలరనేది తేలాల్సిన విషయం.

శరద్ పవార్ కు ముందే వారసుల్లేరు. కూతురు సుప్రియాసూలేపై పెద్దగా ఆశల్లేవు. ఇప్పుడు అజిత్ పవార్ మరణించారు. ఆయనకు ఇద్దరు కుమారులున్నా.. చిన్న కుమారుడికి రాజకీయాలపై ఆసక్తి లేదు. ఇప్పటికే రాజకీయాల్లో ఉన్న పెద్ద కొడుకు పార్థ్‌పై ఇప్పిటకే భూకుంభకోణం ఆరోపణలు వచ్చాయి. కాబట్టి అతడి నాయకత్వాన్ని ఎన్సీపీ క్యాడర్, ప్రజలు అంగీకరించడం సందేహమే. ఇక మిగిలింది అజిత్ భార్య సునేత్ర. ఈమెకు రాజకీయాలపై ఆసక్తి అయితే ఉంది. కానీ ఇప్పటిదాకా నిరూపించుకున్నది లేదు. బారామతిలో ఓడిపోవడం ప్రతికూలమే అయినా.. అవతల సుప్రియాసూలే ఉంది కాబట్టి అర్థం చేసుకోవచ్చనే చర్చ కూడా ఉంది. కానీ సునేత్రను బయటివ్యక్తిగా సాక్షాత్తు శరద్ అభివర్ణించారు. మరిప్పుడు ఆయన వైపు నుంచి సునేత్రకు లైన్ క్లియర్ అవుతుందా.. లేదా అనేది మరో చిక్కు ప్రశ్న. సుప్రియాతోనూ సునేత్రకు సత్సంబంధాలు లేవనే వాదన ఉంది. అదే నిజమైతే.. సునేత్రకు నాయకత్వపరంగా మరిన్ని సమస్యలు తప్పకపోవచ్చు. ఇప్పుడు సునేత్రను డిప్యూటీ సీఎం చేసినా.. ఆమె అజిత్ పవార్ స్థాయిలో ప్రభావం చూపే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఆమెకు రాజకీయాలపై ఆసక్తి మాత్రమే ఉంది కానీ.. అనుభవం, ప్రజలతో సంబంధాలు, పార్టీపై పట్టు లేవు. అవన్నీ ఇప్పటికిప్పుడు వచ్చేవి కాదు. అలాగని కొన్నేళ్ల పాటు కష్టపడి పట్టు సాధిద్దామనుకున్నా.. ఆ సమయం పార్టీ, ప్రజలు ఇస్తారా.. లేదా అనేది చూడాల్సి ఉంది.

ఇప్పటికే సరైన నాయకత్వం లేకపోతే ఏం జరుగుతుందో.. తోటి మహరాష్ట్ర పార్టీ శివసేన అనుభవం ఎన్సీపీ కళ్ల ముందే ఉంది. బాల్ థాక్రే హయాంలో తిరుగులేని శక్తిగా ఉన్న శివసేన.. ఆయన ఉండగానే రెండు ముక్కలైంది. ఇప్పుడు ఏకంగా మూడు ముక్కలైంది. రాజ్ థాక్రే, ఉద్ధవ్ థాక్రే, షిండే రూపంలో ముగ్గురు నేతలు మూడు గ్రూపులకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరందరికీ బాలాసాహెబ్ ఆదర్శాల సాధనే లక్ష్యమైనా.. ఎవరూ ప్రజల్ని పూర్తిస్థాయిలో ఆకట్టుకోలకపోతున్నారు. పరిస్థితులు చూస్తుంటే.. ఏ గ్రూపుకూ మంచి భవిష్యత్తు ఉన్న సూచనలు కనిపించటం లేదు. ఇప్పుడు ఎన్సీపీ కూడా శరద్ పవార్ కళ్ల ముందే రెండు ముక్కలైంది. అజిత్ మరణం తర్వాత మరిన్ని ముక్కలవుతుందా.. లేకపోతే ఒక్కటవుతుందా అనేది కూడా ఆసక్తకరమైన అంశం. కానీ ఒక్కటి కావాలంటే శరద్, అజిత్ కుటుంబాల నుంచి కాకుండా.. పవార్ కుటుంబం నుంచి మరో వ్యక్తి బాధ్యతలు తీసుకోవచ్చనే వాదన వినిపిస్తోంది. శరద్ పవార్ మరో సోదురుడి కుమారుడు.. ఇప్పటికీ శరద్‌కు అండగా ఉన్న రోహిత్ పవార్ వైపు అందరి కళ్లు చూస్తున్నా.. ఆయన నాయకత్వాన్ని అయినా రెండు గ్రూపులూ అంగీకరిస్తాయా అనేది తేలాల్సిన విషయమే.

ఏ రాష్ట్రంలో అయినా.. ఏ పార్టీలో అయినా నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అది కుదురుకోవటానికి కాస్త సమయం పడుతుంది. బయటి శక్తుల ప్రమేయం లేకపోతే ఒకలా.. ఉంటే మరోలా ఆ సెటిల్మెంట్ ఉంటుంది. గతంలో శివసేన వ్యవహారంలో బీజేపీ ఆడిన పొలిటికల్ గేమ్ ఏంటో ఎన్సీపీకి బాగా గుర్తుంది. ఇప్పుడు ఆ పార్టీ మళ్లీ అలాంటి ఆట ఆడకుండా కాచుకోవడమే ఎన్సీపీకి పెద్ద సవాలుగా ఉంది. కాషాయ పార్టీ అయితే కుదిరితే పవార్ కుటుంబ రాజకీయానికి చరమగీతం పాడాలనే ఉద్దేశంతో ఉంటుందనే అభిప్రాయాలున్నాయి. అలాగని సునేత్రకు డిప్యూటీ సీఎం పదవికి ఆ పార్టీ అడ్డుచెప్పకపోవచ్చు. ఎందుకంటే పదవులిచ్చినా నిరూపించుకోలేదనే కారణం చెప్పి ప్రజల మనసు మళ్లించటం సులువనేది ఆ పార్టీకి అనుభవైకవేద్యం.

పరిస్థితులు ఎలా ఉన్నా.. రాజకీయ వ్యూహరచనలో ఆరితేరిన పవార్ కుటుంబం ప్రస్తుత స్థితిలోనూ కొత్త ప్లాన్‌తో వస్తుందనే వాదన కూడా లేకపోలేదు. ఎందుకంటే అవసరాలకు అనుగుణంగా మాటలు మార్చటం శరద్‌కు కొత్తేం కాదు. ఇప్పుడు ఆయన సునేత్రను ఆశీర్వదిస్తే.. లైన్ క్లియరైనట్టే. ఎలాగూ తన గ్రూప్‌ని నడిపే ఆసక్తి లేదు కాబట్టి.. వారిని కూడా సునేత్ర నాయకత్వానికి జై కొట్టమంటే సమస్య కొంతవరకు పరిష్కారమవుతుంది. ప్రజల అంగీకారం విషయంలోనూ సునేత్రకు శరద్ సాయం చేయగలరనడంలో సందేహం లేదు. కానీ ఇవన్నీ జరగాలంటే దానికి సుప్రియా సూలే నుంచి నిరభ్యంతరపత్రం కావాల్సి ఉంటుంది. ఏ దశలో అయినా సుప్రియ అబ్జెక్షన్ చెబితే.. కూతుర్ని కాదని శరద్ చేయగలిగేదేమీ ఉండకపోవచ్చు.

అసలిప్పుడు శరద్ పవార్ ఎలాంటి స్థితిలో ఉన్నారనే విషయంలోనూ చాలా సందేహాలున్నాయి. ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కొందరు, సుప్రియ ఆడించినట్టు ఆడుతున్నారని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే శరద్ ఎప్పుడో బీజేపీ నియంత్రణలోకి వెళ్లిపోయారని కూడా అంటున్నారు. ఈ అభిప్రాయాలు శరద్ అభిమానులు, సన్నిహితులకు నచ్చకపోయినా.. పవార్ మాత్రం కొద్దిరోజులుగా సందిగ్ధంగానే వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు కూడా అజిత్ మరణంపై కేంద్రమే దర్యాప్తుకు ఆదేశిస్తే.. శరద్ మాత్రం అది ప్రమాదమేనని తేల్చిచెప్పేయటం అజిత్ వర్గానికి నచ్చలేదని అంటున్నారు. అంటే ఎన్సీపీలో నాయకత్వ సమస్య కొలిక్కి రావాలంటే.. మొదట పవార్ కుటుంబంలో సమస్యలు సమసిపోవాలి. ఆ తర్వాత ఎన్సీపీ పార్టీ పరంగా ఏకాభిప్రాయం ఉండాలి. కనీసం మెజార్టీ ఒప్పుకోవాలి. ఆ తర్వాత చివరిగా ఎన్సీపీ ఓటుబ్యాంకు ఆమోదముద్ర పడాలి. ఇలా కుటుంబం, పార్టీ, జనం స్థాయిలో పరీక్షల్లో పాసైన నేతే నిలదొక్కుకుంటారు. ఈలోగా బీజేపీ నుంచి కానీ.. మరే ఇతర పార్టీల నుంచైనా అనూహ్య దాడులు ఎదురైనా.. తట్టుకోవాల్సన సమర్థత కూడా కొత్త నాయకత్వానికి చాలా అవసరం. అన్నింటినీ అధిగమించి… వచ్చే అసెంబ్లీ ఎన్నికల దాకా పార్టీని బతికిస్తే.. తర్వాత సంగతి ప్రజలే చూసుకుంటారు. కానీ ఈలోపే పార్టీ కథ ముగిసేలా పరిణతి లేని పనులు చేస్తే మాత్రం ఎన్సీపీని ఎవరూ రక్షించలేరని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

ఇప్పుడు కుటుంబం, పార్టీ స్థాయిలో మాత్రమే చూస్తే శరద్ నిర్ణయం కీలకం కావచ్చు. అనూహ్య నిర్ణయాలకు మారుపేరైన శరద్ పవార్.. మరోసారి చక్రం అడ్డేస్తారని ఎన్సీపీ క్యాడర్ ఆశగా ఎదురుచూస్తోంది. ఎందుకంటే అరవయ్యో దశకంలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైన శరద్.. ఎమ్మెల్యే అయిన పదేళ్లకే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. మూడుసార్లు సీఎంగా పనిచేసిన తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయి ఎన్సీపీ పెట్టి.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. మహారాష్ట్రలో ఉప ప్రాంతీయ పార్టీ అయిన ఎన్సీపీని.. పరిమిత బలంతోనే.. ఢిల్లీ స్థాయిలో ప్రభావశీల పార్టీగా చేసిన ఘనత శరద్ వ్యూహాలదే అనడంలో సందేహం లేదు. కానీ కొంతకాలంగా శరద్ రాజకీయ బుర్రకు పెద్దగా పని చెప్పటం లేదు. చివరిగా 2019లో అజిత్ అనూహ్య తిరుగుబాటును శరద్ తిరుగులేని వ్యూహాలతో విఫలం చేయగలిగారు. కానీ ఆ తర్వాత ప్రతి దశలోనూ అజిత్‌దే పైచేయి అవుతూ వచ్చింది. ఇప్పుడు అజిత్ లేని పరిస్థితుల్లో శరద్ మరోసారి రాజకీయ బుర్రకు పదును పెడతారా.. పాత చాణక్యుడ్ని బయటకు తీసుకొస్తారా అనేది చూడాల్సి ఉంది. శరద్ పవార్ ఇప్పుడు బ్రహ్మాస్త్రం వాడక తప్పదనే చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ పార్టీ తన దగ్గర లేకున్నా.. తనను విభేదించినా అన్న కొడుకు దగ్గరే ఉంది. అంటే తన కుటుంబం దాటి పోలేదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తాను విత్తనం వేసి పెంచిన మహావృక్షం కళ్ల ముందే కుప్పకూలిపోతుంది. ఆ దుస్థితి రాకుండా శరద్ దగ్గర ఏమైనా రాజకీయ మంత్రం ఉందా..? ఇంతవరకూ కొత్త నాయకత్వంపై ఆయన ఎందుకు మాట్లాడటం లేదు..? అసలు శరద్ మనసులో ఏముంది..? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే.. ఎన్సీపీ, పవార్ కుటుంబ రాజకీయం భవిష్యత్తుపై కొంత క్లారిటీ వస్తుంది.

మరాఠ్వాడా రాజకీయం ఇప్పుడు కీలక దశలో ఉంది. థాక్రే కుటుంబ రాజకీయం నామమాత్రంగా అయినా సాగుతోంది. ఇప్పుడు పవార్ రాజకీయం కొనసాగుతుందా.. లేదా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్ని తొలిచేస్తోంది. పవార్ కుటుంబ రాజకీయం ఎలా మహారాష్ట్ర రాజకీయంతో పెనవేసుకుంది..? ఆ కుటుంబం లేకపోతే ఎన్సీపీకి మనుగడ ఉండదా..?

మహారాష్ట్రలో ఎన్సీపీ రాజకీయ భవిష్యత్తును మనం కేవలం ప్రాంతీయ కోణంలోనే చూడలేం. దీనికి జాతీయ కోణాన్ని జోడించకుండా సమగ్ర రాజకీయ ముఖచిత్రంపై స్పష్టత రాదు. అలా చూస్తే.. ఎన్సీపీ ఎప్పుడూ సింగిల్‌గా మహారాష్ట్రను ఏలే స్థాయి కాదు కదా.. సొంతంగా ప్రతిపక్ష పాత్ర పోషించే స్థాయిలో కూడా ఎప్పుడూ లేదు. కానీ ఎన్సీపీ పుట్టిన దగ్గర్నుంచి కింగ్ మేకర్‌ రోల్ అయితే గట్టిగానే పోషించింది. కాంగ్రెస్ నుంచి వేరుపడ్డ ఎన్సీపీ.. తర్వాత అదే పార్టీకి మద్దతుగా నిలిచి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటులోనూ కీలక పాత్ర పోషించటం పవార్ల వ్యూహచతురతకు నిదర్శనం. మహారాష్ట్రలో మిగతా పార్టీలతో పోలిస్తే ఎన్సీపీ క్యాడర్ కూడా తక్కువే. కానీ మహారాష్ట్రలో ప్రజలందరూ పవార్ల అభిప్రాయాలకు బాగా విలువ ఇస్తారు. అంతగా ఆ కుటుంబం రాష్ట్రంపై ముద్ర వేసింది. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉందనేది పక్కనపెడితే.. కీలకమైన సహకార, చక్కెర రంగాల్లో ఇప్పటికీ పవార్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ రెండు రంగాల్ని కాదని మహారాష్ట్రలో ఏ పార్టీ రాజకీయం చేసే పరిస్థితి ఉండదంటే.. పవార్లు ఎంత లోతుగా రాజకీయ పునాదులు నిర్మించుకున్నారో అర్థం చేసుకోవచ్చు.

అలాగని మహారాష్ట్ర ప్రజలకు పవార్ల రాజకీయ కప్పదాట్లు నచ్చాయని కాదు. ఆ విషయంలో ఎన్సీపీ ఓటుబ్యాంకులోనూ అసంతృప్తి ఉంది. అయినా సరే వారు పవార్లను వదిలి వెళ్లటానికి ఇష్టపడరు. ఎందుకంటే పవార్ కు పట్టున్న రంగాలపై ఆధారపడ్డ వారికి.. వారుంటేనే తమ ప్రయోజనాలు నెరవేరతాయనే అభిప్రాయం ఉంది. అందుకు ఎప్పటికప్పుడు సహకార, చక్కెర రంగాల సమస్యలపై ఎన్సీపీ స్థిరంగా చేస్తున్న పోరాటాలే ఊతమిత్చాయని కూడా అంటారు. అయినా సరే ఇటీవలి కాలంలో పవార్లపై ప్రజలకు ముఖం మొత్తిందని, అందుకే ఓటుబ్యాంకు తగ్గుతూ వస్తోందని బీజేపీ ప్రచారం చేస్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర దిగ్గజ నేత శరద్‌ పవార్ ఓటు బ్యాంకు ఆయనే ఆశ్చర్యపోయే స్థాయిలో కుంచించుకుపోయింది. దీంతో ఆయనకు కూడా రాజకీయ విరక్తి వచ్చిందనే చర్చ జరిగింది. మొత్తం మీద మహా రాజకీయాల్లో పవార్లకే సాధ్యమైన ఉత్థానపతనాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ప్రభుత్వాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. పవార్లతో ఔననిపించుకోవటానికి ప్రయత్నిస్తాయి.

శరద్‌ పవార్ తర్వాత రాజకీయ అరంగేట్రం చేసిన బాల్ థాక్రే.. కేవలం నగర ప్రాంతాలకే పరిమితమయ్యారు. దీంతో గ్రామీణ మహారాష్ట్రపై శరద్‌కు ఉన్న పట్టు చెక్కు చెదరలేదు. కాకపోతే థాక్రేకు నగర ప్రాంతాల్లో బీజేపీ నుంచి.. శరద్‌కు గ్రామాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ లేకపోలేదు. ఈ పరిణామాలే శివసేనను బీజేపీ కబళించే స్థితికి తెచ్చాయని పరిశీలకులు చెబుతారు. కాకపోతే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా బలహీనపడటంతో.. ఆ పని చేయలేకపోయింది. కానీ రేపు ఛాన్స్ వస్తే కాంగ్రెస్ కూడా ఎన్సీపీని విలీనం చేసుకోవటం పెద్ద కష్టమేం కాదు. పైగా ఎన్సీపీ ఎలాగూ కాంగ్రెస్ నుంచే పుట్టింది కాబట్టి.. ఆ పని ఇంకా తేలికవుతుంది. మరోవైపు కీలక రాష్ట్రమైన మహారాష్ట్రలో రెండు ప్రాంతీయ పార్టీలను లేకుండా చేసి.. రాజకీయ రంగస్థలంలో తామిద్దరమే ఉండాలని జాతీయ పార్టీలు స్కెచ్ వేశాయనే చర్చ కూడా ఎప్పట్నుంచో ఉంది. అసలు మోడీ కాంగ్రెస్ ముక్త్ భారత్‌ నినాదం లోగుట్టు.. ప్రాంతీయ పార్టీల అంతర్థానమే అనే వాదనతో మహారాష్ట్రలో కూడా కొందరు ఏకీభవిస్తారు.

ఏదేమైనా జాతీయ రాజకీయాల పరంగా మహారాష్ట్ర చాలా కీలకం. ఎందుకంటే ఆర్థిక రాజధాని ముంబై మాత్రమే కాదు.. ఎంపీ సీట్ల పరంగానూ మహారాష్ట్రను జాతీయ పార్టీలు తీసిపారేసే అవకాశమే లేదు. పైగా ముంబై పట్టు బిగిస్తే.. దేశ ఆర్థికవ్యవస్థపై పట్టు చిక్కుతుంది. అప్పుడు దేశాన్ని పాలించటం తేలికవుతుంది. అటు దేశభద్రత పరంగా చూసుకున్నా.. పశ్చిమ తీరంలో నౌకాదళానికి కేంద్రస్థానంగా ముంబై ఉంది. అందుకే దేశ రాజకీయాల్లో మొదట్నుంచీ మహారాష్ట్రకు సముచిత ప్రాధాన్యం ఉంది. కానీ కాంగ్రెస్ ఏకఛత్రాధిత్యం అంతమైన తర్వాత మహారాష్ట్రలో కప్పలతక్కెడ సర్కారులే వచ్చాయి. సంకీర్ణ ప్రభుత్వాలు కావడంతో.. ఎంతకాలం ఉంటాయో తెలియని స్థితి. అందుకే పదేపదే ఎన్నికలు వచ్చాయి. ఈ తీరుతో ప్రజలు కూడా విసిగిపోయారని, అందుకే మోడీ వచ్చాక బీజేపీ వైపు చూస్తున్నారని, అందుకు ఇటీవలి ఫలితాలే నిదర్శనమనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. ఆ భయమే ఇప్పుడు ఎన్సీపీని కూడా టెన్షన్ పెడుతోంది.

అరయంగా కర్ణుడీల్గె ఆర్వురి చేతన్ అన్నట్టుగా.. ఇప్పుడు అన్ని పరిస్థితులూ ముప్పేట దాడి చేసి పవార్ రాజకీయానికి ముగింపు పలుకుతాయేమోననే ఆందోళన ఎన్సీపీలో కనిపిస్తోంది. అందుకే సీనియర్ నేతలు హుటాహుటిన సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ప్రస్తుతానికి తాత్కాలిక ఏర్పాటు దిశగా ఆలోచించారు. అదే సమయంలో ఎన్సీపీ గురించి ఇతర పార్టీల్లోనూ ఇప్పటికే చర్చ జరుగుతూ ఉంటుంది. ఎన్సీపీ భావి నేత ఎవరైతే ఎలాంటి రాజకీయం చేయాలనే వ్యూహరచనలో తలమునకలై ఉంటాయి.

ఇక్కడ శరద్ పవార్ అంటే అందరికీ గౌరవం ఉంది. అజిత్ పవార్ మృతి పట్ల సానుభూతి కూడా ఉంది. కానీ రాజకీయాల్లో తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే కాబట్టి.. ఏ పార్టీ అయినా కష్టాల్లో ఉన్నప్పుడే ఆ పార్టీని బలహీనపరచటానికో, మింగేయటానికో మిగతా పార్టీలు చూడటం సహజం. ప్రస్తుతం ఎన్సీపీ, పవార్ కుటుంబ రాజకీయ భవిష్యత్తును బీజేపీ నిర్దేశిస్తుందని ఒక ఊహ మాత్రమే. అలాగే ఓటుబ్యాంకు పరంగా చూసినా.. పాత చరిత్ర తీసుకున్నా.. కాంగ్రెస్ కూడా ఎన్సీపీని తప్పిస్తే తమకు మేలు జరుగుతుందని ఆశించవచ్చు. తాము స్వయంగా చేయకపోయినా.. ఎవరైనా చేయదలుచుకుంటే వారికి పరోక్ష సహకారం అందించవచ్చు. ఈ విషయంలో శివసేనది ప్రేక్షక పాత్రేనని, అంతకు మించి ఏమీ చేయలేకపోవచ్చని మహారాష్ట్రలో మాట్లాడుకుంటున్నారు.

మొత్తం మీద ఐదు దశాబ్దాల పవార్ల రాజకీయం.. ఇప్పుడు క్రాస్‌రోడ్స్ లో నిలబడింది. రాజకీయ ఒత్తిళ్లు, సవాళ్లను తట్టుకుని నిలబడుతుందా..? శరద్, అజిత్ స్థాయిలో ఈ కుటుంబం నుంచి ఎవరు నిలబడగలరు..? ఈ ప్రశ్నలే ఇప్పుడు కీలకం. ఎందుకంటే పవార్ కుటంబ రాజకీయం కొనసాగుతుందా.. లేదా అనే అంశమే.. ఎన్సీపీ రాజకీయ భవిష్యత్తును ఎక్కువగా ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు.

Exit mobile version