Ajit Pawar Plane Crash: నిన్న మహారాష్ట్ర మొత్తం ఒక్కసారిగా విషాదంలో కూరుకుపోయింది. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్ విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. అయితే.. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా అనేక ప్రశ్నలకు దారి తీస్తోంది. ఇది కేవలం ఒక ప్రమాదమా? లేక చిన్న సాంకేతిక లోపం ప్రాణాంతకంగా మారిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవానికి.. బుధవారం ఉదయం పుణె జిల్లా బారామతి విమానాశ్రయంలో ఈ విషాదం జరిగింది. అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బారామతి రాజకీయాల్లో ‘దాదా’గా పేరున్న 66 ఏళ్ల అజిత్ పవార్ మరణం బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని షాక్‌కు గురిచేసింది. ఆయన నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై అనిశ్చితి నెలకొంది. అయితే అజిత్ పవార్ మామ, ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఇది ప్రమాదమేనని, రాజకీయ రంగు పులుమొద్దని స్పష్టం చేశారు.
READ MORE: ఫోన్‌నే ‘సెకండ్ బ్రెయిన్’గా మార్చిన Infinix’s.. XOS 16 AI ఆధారిత ఫీచర్లు మైండ్ బ్లోయింగ్
విమానం గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రమాదానికి గురైనది 16 ఏళ్ల పాత లియర్‌జెట్. ఇది 2021 జూన్ 2న భారత్‌లో రిజిస్టర్ అయింది. కానీ ఆ తర్వాత కేవలం 28 రోజుల్లోనే ఒక కొత్త నిబంధన అమల్లోకి వచ్చింది. ఆ నిబంధన ప్రకారం.. కొత్తగా రిజిస్టర్ అయ్యే అన్ని విమానాల్లో శాటిలైట్ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ తప్పనిసరిగా ఉండాలి. మన దేశం అభివృద్ధి చేసిన ‘గగన్’ వ్యవస్థ ఉండాలని నిబంధన పెట్టారు. కానీ.. ఆ విమానం ఆ గడువు కంటే ముందు రిజిస్టర్ కావడంతో చట్టపరంగా ఎలాంటి తప్పు లేదు. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అది సాంకేతికంగా పాతదై ఉండొచ్చు. అంటే చట్టం పాటించింది.. కానీ ఆధునిక భద్రతా సాయాన్ని కోల్పోయిందని చెబుతున్నారు. పెద్ద విమానాశ్రయాల్లో సాధారణంగా ‘ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్’ ఉంటుంది. ఇది నేలపై అమర్చే వ్యవస్థ. దట్టమైన పొగ, వర్షం, మబ్బులు ఉన్నా పైలట్‌కు రన్‌వే దిశను స్పష్టంగా చూపిస్తుంది. కనిపించని దారి మీద విమానం నెమ్మదిగా కిందికి దించుకునేలా చేస్తుంది. కానీ ఈ వ్యవస్థ చాలా ఖరీదైనది. చిన్న విమానాశ్రయాల్లో, ముఖ్యంగా బారామతి లాంటి ప్రాంతాల్లో ఇది ఉండదు.
అలాంటి చోట్లకు ప్రత్యామ్నాయంగా భారత్ ‘గగన్’ అనే శాటిలైట్ వ్యవస్థను తీసుకొచ్చింది. ఇది భూమి మీద పరికరాలపై ఆధారపడకుండా, ఉపగ్రహాల ద్వారా పైలట్‌కు ల్యాండింగ్ సమయంలో దిశానిర్దేశం చేస్తుంది. కానీ దీనికి విమానంలో ప్రత్యేక పరికరాలు ఉండాలి. అవి లేకపోతే, గగన్ ఉన్నా ఉపయోగం ఉండదు. బుధవారం కూలిన విమానంలో ఈ వ్యవస్థ ఉందా? అనే విషయంపై అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే అది కొత్త నిబంధనకు ముందే రిజిస్టర్ అయింది. అందుకే గగన్‌కు అవసరమైన పరికరాలు అందులో ఉండకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. బారామతి విమానాశ్రయం మరో ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా నియంత్రిత విమానాశ్రయం కాదు. అంటే అక్కడ ఎప్పుడూ పూర్తి స్థాయి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఉండదు. స్థానిక ఫ్లయింగ్ స్కూల్ పైలట్లు, శిక్షకులు సమాచారాన్ని అందిస్తుంటారు. ఇలాంటి చోట్ల ఆధునిక ల్యాండింగ్ సాయాలు లేకపోతే, పైలట్లు పాత పద్ధతిలోనే ల్యాండ్ అవ్వాలి.
READ MORE: ఫ్లయింగ్ డిస్ప్లేలు, డ్రోన్ షోలు.. Wings India 2026తో ఏవియేషన్ రంగానికి కొత్త ఊపు!
ఆ పద్ధతిని నిపుణులు “చీకటి మెట్ల మీద దిగడం”తో పోలుస్తారు. ఒక్కో దశలో కిందికి దిగుతూ, రన్‌వే కనబడుతోందా లేదా అని చూసుకోవాలి. వాతావరణం బాగుంటే సమస్య ఉండదు. కానీ మబ్బులు, తక్కువ దృష్టి ఉంటే ప్రమాదం చాలా ఎక్కువ. ప్రమాదం జరిగిన రోజు ఉదయం 8:18కి విమానం బారామతి ఎయిర్ ట్రాఫిక్‌తో మాట్లాడింది. పుణె నుంచి విడుదలైన తర్వాత దాదాపు 30 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. గాలి ప్రశాంతంగా ఉందని, దృష్టి సుమారు 3,000 మీటర్లు ఉందని సమాచారం ఇచ్చారు. పైలట్లు తమ ఇష్టానుసారం దిగవచ్చని చెప్పారు. చివరి దశలో రన్‌వే కనిపించడం లేదని పైలట్లు చెప్పారు. అందుకే మొదటి ల్యాండింగ్ ప్రయత్నాన్ని రద్దు చేసి, మళ్లీ పైకి వెళ్లారు. దీన్నే ‘గో అరౌండ్’ అంటారు. పరిస్థితులు సరిగా లేనప్పుడు ఇది సాధారణ ప్రక్రియే. మళ్లీ ప్రయత్నించినప్పుడు కూడా రన్‌వే స్పష్టంగా కనిపించడం లేదని పైలట్లు చెప్పారు. కొద్దిసేపటికి “రన్‌వే కనిపిస్తోంది” అని చెప్పి ల్యాండింగ్‌కు అనుమతి తీసుకున్నారు. సమయం 8:43. కానీ కేవలం ఒక నిమిషం తర్వాత, అంటే 8:44కి రన్‌వే చివర భాగంలో మంటలు కనిపించాయని అధికారులు చూశారు. విమానం రన్‌వేకు దాదాపు 100 మీటర్ల దూరంలో కూలి, మంటల్లో కాలిపోయింది. శిథిలాలు రన్‌వే ఎడమవైపు పడి ఉన్నాయి.