Site icon NTV Telugu

Flight Journey: ఊబకాయ మహిళలకు అవమానం.. ఫ్లైట్‌ నుంచి దించివేత!

Air New Zealand

Air New Zealand

ఊబకాయం ఆ మహిళలకు శాపమైంది. సాఫీగా ప్రయాణం సాగించాలని విమానం ఎక్కిన ఇద్దరు మహిళలకు విమాన సిబ్బంది నుంచి ఊహించని పరిణామం ఎదురైంది. భారీ కాయంతో ఉన్నారన్న కారణంతో ఏకంగా ఫ్లైట్ నుంచి దించేసి అవమానించారు. ఈ ఘటన ఎయిర్‌ న్యూజిలాండ్‌లో చోటుచేసుకుంది. మార్చి 8వ తేదీన జరిగిన ఈ వ్యవహారంపై సదరు విమానయాన సంస్థ స్పందించింది. ఇద్దరు మహిళలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించింది.

ఏంజెల్‌ హార్డింగ్‌ అనే మహిళ స్నేహితురాలితో కలిసి నేపియర్‌ నుంచి ఆక్లాండ్‌కు బయలుదేరారు. విమానం రన్‌వేపైకి చేరుకున్న సమయంలో అటెండెంట్‌ వచ్చి సీట్‌ ఆర్మ్‌రెస్ట్‌ను కిందకు దించేందుకు ప్రయత్నించింది. ఎందుకని వారు ప్రశ్నించగా.. సరైన స్థితిలో కూర్చునేంత వరకు విమానం టేకాఫ్‌ చేయబోనని పైలట్‌ చెప్పినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అటెండెంట్‌ అమర్యాదకరంగా, దురుసుగా వ్యవహరించిందని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. విమానం కదులుతుండగా కేటాయించిన సీట్లలో కూర్చోబెట్టాలని వారిని కోరడంతో.. సిబ్బంది తమను కిందకు దించేస్తామని బెదిరించినట్లు చెప్పారు. ఈ పరిణామంతో షాక్‌కు గురయ్యామని బాధిత మహిళ వాపోయారు.

విమానంలో ఈ వివాదం చోటుచేసుకోవడంతో తిరిగి బోర్డింగ్‌ ప్రదేశానికి ఫ్లైట్ వచ్చేసింది. అసౌకర్యం కారణంగా ప్రయాణికులంతా కిందకు దిగిపోవాలని సిబ్బంది కోరారు. తిరిగి విమానంలోకి ఎక్కించుకొనే క్రమంలో బాధిత మహిళలను మాత్రం విమానంలోనికి అనుమతించలేదు. ఎందుకని ప్రశ్నిస్తే.. ఒక్కొక్కరు రెండు సీట్లు బుక్‌ చేసుకోవాలని సూచించి వెళ్లిపోయారు. ఎందుకు ఎక్కించుకోవడంలేదో మాత్రం స్పష్టంగా చెప్పకుండానే విమానం అక్కడి నుంచి వెళ్లిపోయింది. తమ శరీర ఆకృతి, అధిక బరువు కారణంగానే తమను దించేశారని అర్థమైనట్లు సదరు మహిళ వాపోయారు. ఇలాంటి అవమానకర పరిస్థితి మరెవ్వరికీ ఎదురుకాకూడదని బాధిత మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ విషయంపై బాధిత మహిళలు ఫిర్యాదు చేయడంతో సదరు విమానయాన సంస్థ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. టికెట్‌ డబ్బులు వాపస్‌ చేయడంతో పాటు ఆరోజు స్థానికంగా బస కల్పించినట్లు వెల్లడించింది. అలాగే వారికి ఎదురైన చేదు ఘటనకు క్షమాపణలు చెప్పింది. ప్రయాణికులతో హుందాగా నడుచుకునేందుకు తమ సంస్థ కట్టుబడి ఉందని హామీ ఇచ్చింది.

Exit mobile version