Air India: ఎయిరిండియా.. దేశీయంగా మరియు అంతర్జాతీయంగా శరవేగంతో విస్తరించనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొత్త విమానాల కోసం ఆర్డర్ ఇచ్చింది. ఆ విమానాల్లో పనిచేసేందుకు కొత్తవాళ్లను నియమించుకోనుంది. ఈ ఏడాది 4 వేల 200 మందికి పైగా క్యాబిన్ సిబ్బందిని మరియు 9 వందల మంది పైలట్లను అదనంగా తీసుకోనుంది.
ఏడాది కిందట టాటా గ్రూప్ సొంతమైన ఎయిరిండియా 470 విమానాలను తెప్పించుకునేందుకు బోయింగ్ మరియు ఎయిర్‌బస్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో 70 వరకు పెద్ద విమానాలు ఉన్నాయి. ఈ సంస్థ 36 విమానాలను లీజుకు తీసుకునే ప్రయత్నాల్లో సైతం ఉంది.
read more: Financial Advises: ఆర్థికంగా పైకి రావాలంటే ఏం చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?
ఇప్పటికే రెండు B-777-200 LR విమానాలు వచ్చాయి. గతేడాది మే నెల నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 19 వందల మందికి పైగా క్యాబిన్ సిబ్బందిని నియమించుకుంది. ఇందులో 11 వందల మందికి పైగా సిబ్బందికి గడచిన ఏడు నెలల్లో శిక్షణ ఇప్పించింది. ఈ ట్రైనింగ్ జనవరి నెలతో ముగిసింది.
గత మూడు నెలల్లో దాదాపు 5 వందల మంది క్యాబిన్ సిబ్బందిని విధుల్లోకి తీసుకుంది. మరింత మంది పైలట్లను మరియు మెయింటనెన్స్ ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోనున్నట్లు ఎయిరిండియా ప్రతినిధి సందీప్ వర్మ తెలిపారు. సహజంగా క్యాబిన్ సిబ్బందికి 15 వారాల పాటు శిక్షణ ఇస్తారు. ముంబైలో నిర్వహించనున్న క్లాస్ రూమ్ అండ్ ఇన్-ఫ్లైట్ ట్రైనింగ్‌లో భద్రత మరియు సేవలకు సంబంధించిన నైపుణ్యాలు నేర్పుతారు.