Gold Smuggling: బంగారం అక్రమ రవాణా చేస్తున్న ఎయిర్ ఇండియా క్యాబిన్ సిబ్బందిని బుధవారం అధికారులు కేరళలో అరెస్ట్ చేశారు. బహ్రైన్-కోజికోడ్-కోచి సర్వీస్‌లో సదరు సిబ్బంది పని చేస్తున్నాడు. నిందితుడిని కేరళలోని వయనాడ్‌కు చెందిన షఫీగా గుర్తించారు. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ క్యాబిన్ సిబ్బంది బంగారాన్ని అక్రమంగా రవాణా చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక రోజు తరువాత, ఎయిర్‌లైన్స్ నిందితుడిని అరెస్ట్ చేసినట్లు ధ్రువీకరిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. బంగారం అక్రమంగా రవాణా చేసిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎయిర్‌లైన్స్ అధికారులు వెల్లడించారు. ఆ వ్యక్తిని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ఎయిరిండియా ప్రకటించింది.
Read Also: Pakistan: హిందూ డాక్టర్ గొంతు కోసి దారుణంగా హత్య చేసిన డ్రైవర్..
షఫీ బంగారం అక్రమంగా రవాణా చేస్తున్నాడనే పక్కా సమాచారం అందుకున్న అధికారులు.. బుధవారం కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బంగారాన్ని చేతులకు చుట్టి, చొక్కా స్లీవ్‌ను కప్పుకుని గ్రీన్ ఛానల్ గుండా వెళ్లాలని ప్లాన్ చేశాడు. ఈలోపే కస్టమ్స్ అధికారులు పట్టేసుకుని.. షఫీ నుంచి 1,487 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.