Why Did AIADMK Split: తమిళనాడు రాజకీయాలు రోజు రోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన తర్వాత ప్రధాన ప్రతిపక్షం AIADMK నిలువునా చీలిపోయింది. పార్టీలో నెలకొన్న తీవ్ర అంతర్గత విభేదాల మధ్య, సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఓ వర్గం మంగళవారం సంచలన ప్రకటన చేసింది. కీలకమైన బలపరీక్షకు ముందు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు షణ్ముగం ప్రకటించడం సంచలనంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీతో సంబంధాలు తెగిపోయాయని, ప్రస్తుతం తమ పార్టీ ఏ కూటమిలోనూ లేదని స్పష్టం చేశారు. పార్టీ పరిస్థితిపై విలేకరులతో మాట్లాడిన షణ్ముగం.. అన్నాడీఎంకే చీలికపై క్లారిటీ ఇచ్చారు. ఇందుకు ప్రధాన కారణాన్ని సైతం వెల్లడించారు. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి (EPS) వైఖరిని తీవ్రంగా తప్పుబట్టిన ఆయన.. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు పళనిస్వామి ఏకంగా డీఎంకేతో పొత్తు పెట్టుకోవాలని భావించారని ఆరోపించారు.
“మేము డీఎంకేకు వ్యతిరేకంగానే ఈ పార్టీని స్థాపించాం. 53 ఏళ్లుగా మా రాజకీయం డీఎంకేకు వ్యతిరేకంగానే సాగింది. అలాంటిది ఇప్పుడు వారి మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేద్దామన్న ప్రతిపాదనను పార్టీలోని మెజారిటీ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. డీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అన్నాడీఎంకే ఉనికి కోల్పోతుంది. అందుకే మేము ఎన్నికల్లో విజయం సాధించిన టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం” అని షణ్ముగం వివరించారు. ఇక, పార్టీలో తిరుగుబాటు ఏ స్థాయిలో ఉందంటే.. పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ మంత్రి ఎస్.పి. వేలుమణిని శాసనసభాపక్ష నేతగా నియమించాలని కోరుతూ ప్రొటెం స్పీకర్ ఎం.వి. కరుప్పయ్యకు లేఖ సైతం సమర్పించారు. ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ పళనిస్వామి తప్పుకోవాలని మెజారిటీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పళనిస్వామి అధ్యక్షతన జరిగిన కీలక సమావేశాలకు షణ్ముగం, వేలుమణి సహా పలువురు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం పార్టీలోని చీలికను స్పష్టం చేస్తోంది. తాజాగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగినప్పుడు సైతం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విడివిడి గ్రూపులుగా కూర్చోవడం చర్చనీయాంశమైంది.
