AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్‌లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?

Ai Threat

Ai Threat

AI in Cinema: సినీ ప్రపంచంలో ప్రతి నటుడి ప్రయాణం వెనుక ఒక పెద్ద కథే ఉంటుంది. అందరూ మొదటి సినిమాతోనే స్టార్స్ అయిపోరు. కొందరు తమ ప్రయాణాన్ని గుంపులో ఒకరిగా మొదలుపెడతారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఒకప్పుడు జూనియర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత డిస్కో కింగ్‌గా మారారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ ‘శూల్’ సినిమాలో ఒక చిన్న వెయిటర్ పాత్ర చేసి, ఆపై ఏళ్ల తరబడి గుర్తింపు లేని పాత్రలు పోషిస్తూ వచ్చి ఈరోజు గొప్ప నటుడిగా నిలిచారు. తెలుగు సినిమాల విషయానికొస్తే, ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’లో మహిష్మతి రాజ్యంలో ఒక సాధారణ పౌరురాలిగా, జూనియర్ ఆర్టిస్ట్‌గా కనిపించిన కల్పలత ఆ తర్వాత ‘సలార్’, ‘పుష్ప’ వంటి భారీ చిత్రాల్లో మంచి ప్రాధాన్యమున్న పాత్రలు దక్కించుకున్నారు.

ఇవి వినడానికి ఇప్పుడు సక్సెస్ స్టోరీల్లా అనిపించవచ్చు. కానీ, హైదరాబాద్‌, ముంబైలో నటులు కావాలని కనే వేలాది మందికి జూనియర్ ఆర్టిస్ట్‌గా లేదా ఎక్స్‌ట్రాగా పనిచేయడం అనేది కేవలం స్టార్ అయిపోవడానికి మాత్రమే మార్గం కాదు. అది ఏళ్ల తరబడి టాలీవుడ్, బాలీవుడ్ సినిమాలో అత్యంత సులువైన ప్రవేశ ద్వారంగా ఉంది. నెపోటిజం, గాడ్‌ఫాదర్లు, ఫిల్మ్ స్కూల్ డిగ్రీలు లేదా వైరల్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ లేకపోయినా.. షూటింగ్ సెట్‌కి వెళ్లడం, చెప్పిన చోట నిలబడటం, రోజువారీ బత్తా తీసుకోవడం ద్వారా పొట్టకూటిని వెతుక్కుంటూ తమ కలను ప్రాణపణంగా నిలబెట్టుకునే ఒక మార్గం. కానీ.. ఇప్పుడు ఈ మార్గం మూసుకుపోనుంది. ఎందుకంటే.. ఈ మొదటి అవకాశానికే కృత్రిమ మేధస్సు (AI) రూపంలో పెద్ద గండం వచ్చి పడింది. ప్రముఖ డైరెక్టర్ నితేష్ తివారీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ‘రామాయణ్’ ట్రైలర్ వచ్చాక, అందులోని భారీ డిజిటల్ క్రౌడ్ చూసి అంతా ఆశ్చర్యపోయారు. యష్ పోషించిన రావణాసురుడి పాత్ర ముందు కనిపించిన వేలాది మంది జనసందోహం విజువల్ ఎఫెక్ట్స్ ప్రయోగానికి ఒక ఉదాహరణ. ఇది కేవలం మీమ్స్, జోకులకు మాత్రమే పరిమితం కాలేదు, సినీ నిర్మాణంలో వస్తున్న ఒక పెద్ద మార్పును సూచిస్తోంది.

స్క్వాడ్ VFX హెడ్ అఖిలేష్ జైన్ ప్రకారం.. ‘కన్నప్ప’, ‘బోర్డర్ 2’, ‘గదర్ 2’ వంటి సినిమాల్లో ఇప్పటికే AIతో క్రౌడ్ క్రియేషన్ సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. 100 మందికి పైగా జనం ఉండే సన్నివేశాల్లో 20 శాతం మంది నిజమైన ఆర్టిస్టులు ఉంటే, మిగిలిన 80 శాతం మందిని డిజిటల్‌గా సృష్టిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం నిర్మాణ వ్యయం తగ్గించుకోవడమే. 200 నుంచి 500 మంది జూనియర్ ఆర్టిస్టులను సెట్‌కు తీసుకువచ్చి వారికి రవాణా, ఆహారం, కాస్ట్యూమ్స్, మేకప్ వంటి ఖర్చులు భరించడం కంటే ఏఐ ద్వారా క్రౌడ్ క్రియేషన్ చేయడం చాలా చౌకగా మారుతోంది. మరో ఆసక్తికరమైన, ఆందోళనకరమైన విషయమేమిటంటే.. కొద్దిమంది నిజమైన ఆర్టిస్టులను 3D స్కాన్ చేసి, వారి శరీర నిర్మాణం, ముఖ కవళికలను వాడుకుని వేలాది మంది డిజిటల్ మనుషులను తయారుచేస్తున్నారు. ఈ సాంకేతికతపై బాలీవుడ్ నటుడు మిహిర్ అహుజా స్పందిస్తూ, తనకు AI పట్ల భయం లేదని, AI నటుల భావోద్వేగాలను, అనుభూతులను హ్యూమన్ టచ్‌తో పండించలేదని స్పష్టం చేశారు. అయితే అసలు ముప్పు మిహిర్ లాంటి నటులకు కాదు, ఇంకా ఒక్క అవకాశం కూడా రాని కొత్తవారికి. కెరీర్ ప్రారంభంలోనే ముఖం చూపించే అవకాశం ఏఐ వల్ల పోతే, అసలు నటన ప్రయాణం ఎలా మొదలవుతుంది? అనేదే అసలు ప్రశ్న.

అయితే, ప్రతి సీన్‌లోనూ జూనియర్ ఆర్టిస్టులను ఏఐ భర్తీ చేయలేదు. ‘బాహుబలి’ సినిమాల వీఎఫ్ఎక్స్ హెడ్ శ్రీనివాస్ మోహన్ ప్రకారం.. కెమెరాకు దగ్గరగా ఉండే ఆర్టిస్టులను డిజిటల్‌గా సృష్టించడం కష్టం. స్క్రీన్‌లో సగం భాగం ఆక్రమించే పాత్రలకు నిజమైన మనుషులే కావాలి. కానీ, సుదూరంలో కనిపించే చిన్న పాత్రలకు మాత్రం ఏఐ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంటే కెమెరాకు ఎంత దగ్గరగా ఉంటే ఉద్యోగం సేఫ్, మరి వెనుక నిలబడే వారి పరిస్థితేంటి? అనేది మరో ప్రశ్న. ఇదిలా ఉండగా.. ఏఐ కేవలం సెట్స్‌లో గుంపులను సృష్టించడానికే కాకుండా, ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో దర్శకులు తమ ఆలోచనలను విజువల్‌గా చూపించడానికి, రోటోస్కోపింగ్, రీలైటింగ్ వంటి పనులకు ఎంతో సహాయపడుతోంది. అయితే స్టూడియో బ్లో సీఈఓ దీపక్ ముఖర్జీ అన్నట్లుగా.. ఏఐని కేవలం ఒక షార్ట్‌కట్‌లా చూస్తే అవుట్‌పుట్ ఫేక్‌గా కనిపిస్తుంది, దానికి కూడా సరైన క్రాఫ్ట్ అవసరం. ఏదేమైనా, హైదరాబాద్, ముంబై సినీ పరిశ్రమ ఎప్పుడూ ఒక నమ్మకాన్ని ఇస్తూ వచ్చింది.. మీరు ఏమీ లేకపోయినా వచ్చి గుంపులో నిలబడితే, ఏదో ఒక రోజు ముందు వరుసలోకి వస్తారని. కానీ, ఇప్పుడు ఏఐ వల్ల ఆ గుంపు సైజు తగ్గిపోతుంటే, సినిమా పరిధి పెరుగుతున్న కొద్దీ ఎంట్రీ గేట్ చిన్నదైపోతోందా అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి.