తెలంగాణలో నేటి నుంచి వ్యవసాయ భూముల సర్వే చేపట్టనున్నారు. రైతు భరోసా అమలు కోసం భూసర్వే చేపట్టనున్న అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. తెలంగాణ వ్యాప్తంగా సాగు భూమి, సాగులో లేని భూముల సర్వే నిర్వహించనున్నారు. ఏ పథకమైనా అర్హులకు మాత్రమే అందాలి. అప్పుడే కదా.. టాక్స్ పేయర్స్ మనీకి విలువ ఉంటుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు పథకం నిధులు పక్కదారి పట్టాయి అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతు భరోసా పథకాన్ని మాత్రం.. అలా నీరు గార్చే ప్రసక్తే లేదు అంటోంది. అనర్హులను ఏరివేసి.. నిజమైన రైతులకే దాన్ని అమలుచేస్తామంటోంది. పూర్త పారదర్శకంగా ఈ స్కీమ్ అమలుచేస్తామని తెలిపింది.
ఈ స్కీమ్‌కి సంబంధించి ప్రభుత్వం.. గ్రామాల వారీగా సాగు భూమి ఎంత?, రియల్ ఎస్టేట్ భూములు ఎన్ని ఉన్నాయి, కొండలు, గుట్టలు ఎన్ని ఉన్నాయి, సాగులో లేని దేవాదాయ, వర్ఫ్ భూములు ఏవి ఉన్నాయి? వంటి వివరాల్ని సేకరించేందుకు వ్యవసాయ శాఖ పూర్తిస్థాయిలో 3 రోజులుగా సర్వే చేపట్టింది. వచ్చే వారంలో ఈ సర్వే పూర్తవుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పేరుతో.. ప్రతి రైతుకూ ఎకరాకీ ఏడాదికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. రైతులకు, కౌలురైతులకు కూడా సంవత్సరానికి ఎకరాకి రూ.15 వేల చొప్పున ఇస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో తెలిపింది. అలాగే.. రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి రూ.12,000 చొప్పున ఇస్తామంది. కానీ ఇంకా ఈ స్కీమ్ అమలు కాలేదు.