Onion: పెరుగుతున్న ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ధరలను నియంత్రించడంతో పాటు సరఫరాను మెరుగుపరిచేందుకు వీలుగా ఉల్లి ఎగుమతులపై శనివారం 40శాతం సుంకాన్ని విధించిన సంగతి తెలిసిందే. ఉల్లి బఫర్ స్టాక్‌ను 300,000 మెట్రిక్ టన్నుల నుండి 500,000 మెట్రిక్ టన్నులకు పెంచినందున, ఉల్లి బఫర్ స్టాక్‌ను నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య-ఎన్‌సీసీఎఫ్) ద్వారా సోమవారం నుంచి కిలోకు రూ. 25 చొప్పున సబ్సిడీపై విక్రయించనున్నట్లు కేంద్రం ఆదివారం తెలిపింది. అక్టోబర్‌లో కొత్త పంట వచ్చే వరకు ఉల్లి ధరలను అదుపులో ఉంచాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read Also: Arvind Kejriwal: మామ మోసం చేశాడు, ఈ చాచాను నమ్మండి.. కేజ్రీవాల్ హామీల వర్షం
అధికారిక ప్రకటన ప్రకారం, ప్రభుత్వ బఫర్ స్టాక్ నుంచి ఉల్లిపాయలు సోమవారం నుంచి ఎన్‌సీసీఎఫ్ అవుట్‌లెట్‌లు, మొబైల్ వ్యాన్‌ల ద్వారా రిటైల్ వినియోగదారులకు అందుబాటులో ఉంచబడతాయి. సరఫరా తక్కువగా ఉన్న సమయంలో ధరలు ఊహించని విధంగా పెరిగినట్లయితే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి (PSF)లో 3 లక్షల టన్నుల ఉల్లిపాయలను నిల్వ చేసింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లను చేర్చడం ద్వారా ఉల్లిపాయల రీటైల్ విక్రయం రాబోయే రోజుల్లో తగిన విధంగా మెరుగుపడుతుందని ప్రకటన పేర్కొంది. ఇదిలా ఉండగా ఎన్‌సీసీఎఫ్, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (NAFED) రెండింటినీ అదనంగా 100,000 టన్నుల ఉల్లిపాయలను సేకరించాలని వినియోగదారుల వ్యవహారాల విభాగం ఆదేశించింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఉల్లిపాయల ధర స్వల్పంగా పెరగడం ప్రారంభించింది. ఆగస్ట్ 10 నాటికి ఆల్-ఇండియా రిటైల్ ధర కిలోగ్రాముకు రూ. 27.90గా ఉంది, గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే కిలోగ్రాముకు కేవలం రూ. 2 పెరిగింది.దేశీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరలను అదుపు చేసేందుకు కేంద్రం శనివారం డిసెంబర్ 31 వరకు ఉల్లి ఎగుమతిపై 40 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల టమాటా ధరలు ఆకాశన్నంటిన సమయంలో కూడా కేంద్రం సబ్సిడీలో విక్రయించిన సంగతి తెలిసిందే. ఈ తరహాలోనే ఇప్పుడు ఉల్లి విక్రయాలు జరగనున్నట్లు తెలుస్తోంది.
