NTV Telugu Site icon

Asia Cup 2025-India: 34 ఏళ్ల తర్వాత ఆసియా కప్‌కు భారత్ ఆతిథ్యం.. టీ20 ఫార్మాట్‌లో టోర్నీ!

Asia Cup 2025 India

Asia Cup 2025 India

India to host 2025 Asia Cup in T20 Format: 2025లో జరగనున్న పురుషుల ఆసియా కప్‌‌కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ విషయాన్ని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఓ ప్రకటనలో తెలిపింది. 1984లో ఆసియా కప్‌‌ మొదలవ్వగా.. చివరిగా భారత్ 1991లో ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాత భారత్ గడ్డపై టోర్నీ జరగలేదు. 34 ఏళ్ల తర్వాత ఈ మెగా టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది ఆసియా కప్‌ టీ20 ఫార్మాట్‌లో జరుగనున్నది.

2026లో టీ20 ప్రపంచకప్ ఉండటంతో 2025 ఆసియా కప్‌‌ను పొట్టి ఫార్మాట్‌లో నిర్వహించాలని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ నిర్ణయించింది. 2016 నుంచి ఈ మెగా ఈవెంట్‌.. ప్రపంచకప్ పోటీకి సన్నాహక టోర్నమెంట్‌గా ఉపయోగపడుతోంది. ప్రపంచకప్ ఫార్మాట్‌ను బట్టి ఆసియా కప్‌‌ను నిర్వహిస్తున్నారు. 2027లో ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యం ఇవ్వనుంది. వన్డే ఫార్మాట్‌లో టోర్నీ జరగనుంది. ఎందుకంటే.. ఆ ఏడాది వన్డే ప్రపంచకప్ ఉంటుంది.

Also Read: Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్ 2024.. చరిత్రకు అడుగు దూరంలో మను బాకర్!

ఆసియా కప్‌‌ 2025కి సంబంధించి మ్యాచ్‌ల షెడ్యూల్‌ను ఇంకా ఖరారు చేయలేదు. భారత్‌లో వర్షాకాలం ముగిసిన అనంతరం సెప్టెంబర్‌లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఆసియా కప్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొననుండగా.. 13 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్థాన్‌తో పాటు మరో జట్టు పాల్గొననుంది. 2023లో ఆసియా కప్‌ను హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించగా.. వన్డే ఫార్మాట్‌లో జరిగిన ఆ టోర్నీకి పాక్‌ ఆతిథ్యం ఇచ్చింది. అత్యధికంగా బంగ్లాదేశ్ అయిదు సార్లు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇచ్చింది.

Show comments