Rahul Gandhi: ఢిల్లీలోని ఎర్రకోటలో గురువారం జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని విన్నారు. గతంలో ఆ పదవి ఖాళీగా ఉండడంతో ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడం ఇదే తొలిసారి. 2014 నుండి 2024 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఎవరూ ఉండలేదు, ఎందుకంటే ప్రతిపక్ష పార్టీలలో ఎవరికీ అవసరమైన సంఖ్యలో ఎంపీలు లేవు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తన ఎంపీల సంఖ్యను మెరుగుపరుచుకున్న తర్వాత జూన్ 25న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా నియమించారు. పదేళ్ల తర్వాత ప్రతిపక్ష నేత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడం గమనార్హం.
Read Also: PM Modi: 2047 నాటికి ‘వికసిత భారత్’ మనందరి లక్ష్యం
దేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై జాతినుద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగించారు. భారత ప్రస్థానం ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని ప్రధాని పేర్కొన్నారు. శతాబ్దాల తరబడి దేశం బానిసత్వంలో మగ్గిందన్న ఆయన.. స్వాతంత్ర్యం కోసం ఆనాడు 40 కోట్లమంది ప్రజలు పోరాడారని.. ఇప్పుడు మన దేశ జనాభా 140 కోట్లకు చేరిందన్నారు. అప్పుడు ఉన్న 40 కోట్ల మంది దేశానికి స్వతంత్రాన్ని సాధిస్తే.. ఇప్పుడు 140 కోట్ల మంది ఎంత సాధించవచ్చో ఆలోచించాలన్నారు. ఈ 140 కోట్ల జనం వారి కలలను సాకారం చేయాలన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలన్నారు. కొన్నేళ్లుగా విపత్తులు దేశాన్ని ఇబ్బందిపెట్టాయని.. విపత్తు బాధిత కుటుంబాలకు ప్రధాని మోడీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. 2047 నాటికి వికసిత భారత్ మనందరి లక్ష్యమని.. భారత్‌ను ప్రపంచ నైపుణ్యాల రాజధానిగా మార్చాలన్నారు. తయారీరంగంలో గ్లోబల్ హబ్‌గా భారత్‌ను మార్చాలని ఆకాంక్షించారు. ప్రపంచానికే అన్నం పెట్టే స్థాయికి భారత్ ఎదగాలని ప్రధాని మోడీ కోరుకున్నారు.