NTV Telugu Site icon

Inter Colleges: ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపు సందేహమే..

Inter

Inter

Inter Colleges: తెలంగాణలో ఇంటర్మీడియట్ కాలేజీల అనుబంధ గుర్తింపులో ఏటా ఇబ్బందులు తప్పడం లేదు. చాలా జూనియర్ కాలేజీల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. 1471 ప్రైవేటీ కాలేజీలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోగా.. ఇప్పటి వరకు 958 ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు మాత్రమే అనుబంధ గుర్తింపు లభించింది. 5 వందలకు పైగా కాలేజీల గుర్తింపు ప్రక్రియ పెండింగ్‌లో ఉంది. కాలేజీలు ప్రారంభం అయినా గుర్తింపు ప్రక్రియను ఇంటర్‌ బోర్డు పూర్తి చేయకపోవడం గమనార్హం. కాలేజీల ప్రారంభంకుముందే పూర్తి చేస్తామని గతంలో బోర్డు ప్రకటించింది. ఇప్పుడు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే జాయిన్ కావాలని… వెబ్ సైట్‌లో అనుమతి ఉన్న కాలేజీల జాబితా ఉందని ఇంటర్ బోర్డు చెబుతోంది.

Read Also: Tamil Nadu: నీట్‌ను రద్దు చేయాలని తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం..

అనుబంధ గుర్తింపు లేని కాలేజీల్లో చేరితే పరీక్షలకు అనుమతి ఉండదని ఇంటర్‌బోర్డు అంటోంది. మిక్స్డ్ అక్యూపెన్సీ బిల్డింగ్‌లో నడుస్తున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు వస్తుందో రాదో తెలియని పరిస్థితి నెలకొంది. రెండేళ్ల క్రితం ఆ కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇవ్వని బోర్డు… ప్రభుత్వ చొరవతో రెండేళ్లు కాలేజీలు అనుమతి పొందాయి. ఈ క్రమంలోనే ఆ గడువు ముగిసింది. ఆ కాలేజీలకు అగ్నిమాపక శాఖ ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ సబ్మిట్ చేస్తేనే వాటికి గుర్తింపు లభించనుంది. అనుబంధ గుర్తింపు లేని కాలేజీల్లో చేరొద్దని బోర్డు ప్రకటన విడుదల చేసింది.ఇప్పటికే చాలా కాలేజీల్లో విద్యార్థులు జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని ఇంటర్ బోర్డు పట్టించుకోలేదు. మిక్స్‌డ్ ఆక్యుపెన్సీ బిల్డింగ్‌లో నడుస్తున్న 360కి పైగా జూనియర్ కాలేజీల పరిస్థితి త్రిశంకు స్వర్గంలా మారింది.

దశాబ్దాలుగా ఈ బిల్డింగ్‌లోనే కాలేజీలు నడుస్తున్నాయని ప్రైవేట్ జూనియర్ కాలేజి యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. ఈ కాలేజీలకు మినహాయింపు ఇవ్వాలని, వేలాది సిబ్బంది పని చేస్తున్నారని యాజమాన్యాలు తెలిపాయి. ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ తేవడమో, కాలేజీని షిఫ్ట్ చేయడమో అయ్యే పని కాదని.. ప్రభుత్వం ఆలోచించాలి , మమ్మల్ని ఆదుకోవాలని కోరుతున్నారు.