రోడ్డు ప్రమాదాలు ఎక్కువయ్యాయి. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో కొండ తామరపల్లి జంక్షన్ వద్ద ఆటోని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు గంట్యాడ మండలం గింజేరు గ్రామానికి చెందిన కె రాముగా పోలీసులు చెబుతున్నారు. రాము వెల్డింగ్ పని నిమిత్తం కొండ తామరపల్లి జంక్షన్ కు ఆటో రాగ… అక్కడ పని జరగకపోవడంతో తిరిగి అదే ఆటోలో గ్రామానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు.
ఈ క్రమంలో ఆటోను కొండ తామరపల్లి జంక్షన్లో రివర్స్ చేస్తుండగా.. ఎస్.కోట నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొట్టింది. ఆటోలో ప్రయాణిస్తున్న రాము ఆర్టీసీ బస్సు వెనుక చక్రాల కింద పడిపోయాడు. ఈ ప్రమాదంలో రాము అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాముకి ప్రమాదం జరిగిన విషయాన్ని మృతుని కుటుంబీకులకు పోలీసులు తెలియపరిచారు. మృతుడు రాము బంధువులు పెద్ద సంఖ్యలో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
విహరయాత్రకు వచ్చి….
అల్లూరి జిల్లా చింతూరు మండలం మోతుగూడెం సమీపంలోని పొల్లూరు జలపాతంలో పడి ఒకరు దుర్మరణం చెందారు. మోతుగూడెం సబ్ ఇన్ స్పెక్టర్ వాసంశెట్టి సత్తిబాబు తెలిపిన వివరాల ప్రకారం… కాకినాడకి చెందిన పలివెల హసాన్ ప్రీతం(20) నలుగురు స్నేహితులతో కలిసి విహారయాత్ర కోసం పోల్లూరు జలపాతం వద్దకు వచ్చి సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి మృత్యువాత పడ్డాడు. స్నేహితులు అందరూ డిగ్రీ చదువుకుంటున్నారు. స్థానికుల సహయంతో మృతదేహన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం నిమిత్తం చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించామని తెలియజేసారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్నేహితుడి మరణంతో వారి స్నేహితులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
