స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి మరోసారి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చంద్రబాబుకు మరో 14 రోజులు రిమాండ్ ను ఏసీబీ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 19 వరకు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగిస్తున్నట్లు చంద్రబాబుకు ఏసీబీ జడ్జ్ చెప్పారు. ఇక చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. రేపు (శుక్రవారం) మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు తెలిపింది. ఈ రెండు పిటిషన్లపై రెండు రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అయితే, చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.
Read Also: Titan Tragedy: అప్పుడు “టైటానిక్”, ఇప్పుడు “టైటాన్ ట్రాజెడీ”పై సినిమా…
అయితే, ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరుపున లాయర్ ప్రమోద్ కుమార్ దూబే వాదనలు వినిపించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబు కు సంబంధం లేదని ఆయన చెప్పారు. రెండేళ్ల తర్వాత రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించారని కోర్టు దృష్టికి దూబే తీసుకెళ్లారు. చంద్రబాబు సీఎం హోదాలో స్కిల్ డెవలప్ మెంట్ స్కీంకు నిధులు మాత్రమే రిలీజ్ చేశారు.. ఆ తరువాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేసినట్లు దూబే తెలిపారు. ఇక కస్టడీ అవసరం లేదు.. అయినా విచారణ సాగదీసేందుకే ఈ పిటిషన్ సీఐడీ వేసిందని ఆయన అన్నారు. ఈ అంశాలను పరిశీలించిన ఏసీబీ కోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది.. అలాగే చంద్రబాబు రిమాండ్ ను మరో 14 రోజుల పాటు పొడిగించింది.