Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా విడుదల చేసిన టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా, యువ సంచలనం అభిషేక్ శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బౌలర్ల విభాగంలో వరుణ్ చక్రవర్తి తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. అయితే, ఆల్ రౌండర్ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా స్థానాన్ని పాకిస్తాన్ ఆటగాడు సైమ్ అయూబ్ భర్తీ చేశాడు.
Pushpaka Vimana Story: రావణుడు పుష్పక విమానాన్ని ఎవరి నుంచి లాక్కున్నాడు..?
తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో భారత్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ 931 రేటింగ్ పాయింట్లతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇది దాదాపు ఐదేళ్ల పాటు చెక్కుచెదరకుండా ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. 2020లో ఇంగ్లాండ్ ఆటగాడు డేవిడ్ మలాన్ సాధించిన 919 పాయింట్ల రికార్డును అభిషేక్ అధిగమించాడు. అంతేకాకుండా, సూర్యకుమార్ యాదవ్ (912), విరాట్ కోహ్లీ (909) వంటి సీనియర్ ఆటగాళ్ల రికార్డులను కూడా అభిషేక్ దాటేశాడు.
గత ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అభిషేక్, ఆసియా కప్‌లో 200కు పైగా స్ట్రైక్ రేట్‌తో 7 మ్యాచ్‌లలో 314 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచాడు. ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ఫిల్ సాల్ట్‌తో పోలిస్తే అభిషేక్ 82 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నాడు. ఆ తర్వాత భారత్ ఆటగాడు తిలక్ వర్మ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సంక ఐదో స్థానానికి చేరుకోగా.. కుశల్ పెరేరా, సాహిబ్‌జాదా ఫర్హాన్, సంజు శాంసన్ వంటి ఇతర ఆటగాళ్లు కూడా తమ ర్యాంకింగ్‌లను మెరుగుపరుచుకున్నారు.
ఇక బౌలింగ్ విభాగంలో ఆసియా కప్‌లో 7 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవర్తి నెంబర్ వన్ ర్యాంకర్‌గా కొనసాగుతున్నాడు. కుల్దీప్ యాదవ్ (12) ర్యాంకింగ్‌ను గణనీయంగా మెరుగుపరుచుకున్నారు. ఇక ఆల్ రౌండర్ల విభాగంలో పాకిస్తాన్ ఆటగాడు సైమ్ అయూబ్ హార్దిక్ పాండ్యాను వెనక్కి నెట్టి తొలిసారిగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బ్యాటింగ్‌లో రాణించలేకపోయినా.. బౌలింగ్‌లో 8 వికెట్లు తీసి సైమ్ అయూబ్ నాలుగు స్థానాలు పైకి ఎగబాకి పాండ్యాను అధిగమించాడు. పాండ్యా ఇప్పుడు రెండో స్థానంలో ఉన్నాడు.
