Abhijeet Dipke: ఢిల్లీ పోలీసులు తనను ఎప్పుడైనా అదుపులోకి తీసుకోవచ్చని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ప్రకటన చేశారు. పార్టీ ఆధ్వర్యంలో తలపెట్టిన తిరంగా మార్చ్‌కు ముందు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. తమను నంబర్ ప్లేట్లు లేని కార్లు వెంబడిస్తున్నాయని, ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) సిబ్బంది తన ఇంటిపై నిఘా పెట్టారని ఆయన ఆరోపించారు. ఓ వైపు సీజేపీ శుక్రవారం తిరంగా మార్చ్ నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈరోజు ఉదయం పోలీసులు తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని దీప్కే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గురువారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన దిప్కే.. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ శాంతియుతంగా జాతీయ జెండాను ఎగురవేస్తామని స్పష్టం చేశారు. తిరంగాన్ని ఎగురవేయడం నేరమైతే, తాము జైలుకెళ్లడానికైనా సిద్ధమేనని, అలా చేస్తే దేశద్రోహులు ఎవరనేది స్పష్టమవుతుందని అన్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు.
ఇక, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో జరిగిన అక్రమాలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో గుమికూడాలని సీజేపీ పిలుపునిచ్చింది. అయితే, ఈ మార్చ్ తలపెట్టిన సెంట్రల్ పార్క్‌ను అక్టోబర్ 16, 17 తేదీల్లో మూసివేస్తున్నట్లు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎండీఎంసీ) ప్రకటించడం గమనార్హం. దీనిపై మండిపడ్డ దిప్కే.. ఇలా వంద ప్రదేశాల్లో తిరంగా యాత్ర చేపడితే ప్రభుత్వం అన్ని చోట్ల పార్కులను మూసేస్తుందా అని ప్రశ్నించారు. ఏ రాజకీయ సభలోనైనా ప్రజలు జాతీయ జెండా పట్టుకుంటే ఆ సభలనే రద్దు చేస్తారా అని నిలదీశారు. ప్రభుత్వాన్ని కూలదోయాలని తాము కోరుకోవడం లేదని, కేవలం స్వతంత్ర, నిష్పక్షపాత ప్రక్రియ ద్వారా సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించి వేరే వారిని నియమించాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని దిప్కే స్పష్టం చేశారు. తోటి ఎన్నికల కమిషనర్ల మాటలను కూడా ఆయన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం అప్రకటిత అత్యవసర పరిస్థితి నడుస్తోందని విమర్శించిన ఆయన.. నేరుగా ఎమర్జెన్సీ విధిస్తే తన పరువు పోతుందనే ఉద్దేశంతోనే ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేది లేదని తేల్చిచెప్పారు.

