Aaron Finch: వరల్డ్‌ క్రికెట్‌లో కోహ్లీనే తోపు.. రెండో స్థానంలో సచిన్.. ఫించ్ సంచలన ర్యాంకింగ్స్

Aaron Finch Top 8 Odi Batters

Aaron Finch Top 8 Odi Batters

Aaron Finch Picks Top 8 ODI Batters: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ‘టాప్-8’ బ్యాటర్ల జాబితాను విడుదల చేసి క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు తెరలేపారు. క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్‌ను వెనక్కి నెట్టి, విరాట్ కోహ్లీకి అగ్రస్థానాన్ని కట్టబెట్టడం విశేషం. ఇక ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మకు టాప్-3లో కూడా స్థానం దక్కలేదు. రోహిత్‌ను 5వ స్థానానికి పరిమితం చేశారు. ఆధునిక క్రికెట్‌లో విరాట్ కోహ్లీ ప్రదర్శిస్తున్న స్థిరత్వం, మ్యాచ్‌లను గెలిపించే అద్భుత సామర్థ్యమే ఆయనను వన్డే చరిత్రలోనే అత్యంత గొప్ప బ్యాటర్‌గా నిలబెట్టాయని ఫించ్ పేర్కొన్నారు. ఓ ప్రత్యేక వీడియో సెగ్మెంట్‌లో దిగ్గజ ఆటగాళ్ల పేర్లు ఒకదాని తర్వాత ఒకటి రాగా, ఫించ్ తన ఆల్-టైమ్ ర్యాంకింగ్స్‌ను రూపొందించారు.

గణాంకాల్లో సచిన్‌ను కోహ్లీ ఎలా దాటేశారు?

గణాంకాల పరంగా చూస్తే, సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 463 వన్డేల్లో 18,426 పరుగులు చేయగా, అందులో 49 సెంచరీలు, 96 అర్ధసెంచరీలు ఉన్నాయి. మరోవైపు, విరాట్ కోహ్లీ కేవలం 314 వన్డేల్లోనే 14,941 పరుగులు సాధించాడు. సచిన్ కంటే చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడినప్పటికీ, వన్డేల్లో ఏకంగా 54 సెంచరీలు, 79 అర్ధసెంచరీలు బాదాడు విరాట్. ఈ అద్భుతమైన సెంచరీల రికార్డు, మ్యాచ్ విన్నింగ్ నాక్స్ చూసే ఫించ్.. సచిన్ కంటే కోహ్లీకే మొదటి స్థానాన్ని ఇచ్చారు.

రెండో స్థానంలో సచిన్.. రేసులో డివిలియర్స్, పాంటింగ్

ఫించ్ జాబితాలో సచిన్ టెండూల్కర్ రెండో స్థానంలో నిలిచారు. సచిన్ సాధించిన పరుగుల జాబితాను, ఆయన శకాన్ని ఎవరూ మర్చిపోలేరని, అయితే ప్రస్తుత యుగంలో కోహ్లీ చూపిన ప్రభావం మరింత ఎక్కువగా ఉందని ఫించ్ అభిప్రాయపడ్డారు. దక్షిణాఫ్రికా మిస్టర్ 360 డిగ్రీల బ్యాటర్ ఏబీ డివిలియర్స్ 3వ స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియాకు రెండు ప్రపంచకప్‌లు అందించిన రికీ పాంటింగ్‌కు 4వ స్థానం లభించింది.

రోహిత్ శర్మకు 5వ స్థానం
వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక బ్యాటర్ రోహిత్ శర్మను ఫించ్ 5వ స్థానానికి పరిమితం చేయడం అభిమానులను కొంత ఆశ్చర్యానికి గురిచేసింది. మిడిలార్డర్, టాప్ ఆర్డర్ సమతుల్యత దృష్ట్యా డివిలియర్స్, పాంటింగ్‌లు రోహిత్ కంటే ముందుంటారని ఫించ్ భావించారు. ఇక, వెస్టిండీస్ దిగ్గజం సర్ వివియన్ రిచర్డ్స్‌కు 6వ స్థానం లభించింది. రిచర్డ్స్ పేరు చివర్లో రావడం వల్ల వేరే స్లాట్లు ఖాళీ లేక బలవంతంగా 6వ స్థానంలో ఉంచాల్సి వచ్చిందని ఫించ్ చెప్పారు. శ్రీలంక ఆల్‌రౌండర్ సనత్ జయసూర్య 7వ స్థానంలో, ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్ 8వ స్థానంలో నిలిచారు.