Site icon NTV Telugu

Bypoll Results: పంజాబ్ లో ఆప్ కు ఎదురుగాలి..ఘోర పరాజయం

Punjab, Bhagavant Mann

Punjab, Bhagavant Mann

పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించి కొన్ని నెలలు కాకముందే ఉప ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఏకంగా ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ గతంలో ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన సంగ్రూర్ లోక్ సభ స్థానంలో ఘోర పరాజయాన్ని చవిచూసింది.  ఈ స్థానం నుంచి శిరోమణి అకాలీదళ్(అమృత్‌సర్) అభ్యర్థి సిమ్రన్ జిత్ సింగ్ మాన్ గెలుపొందారు. హోరాహోరీగా జరిగిన పోరులో ఆప్ అభ్యర్థి గుర్‌మైల్ సింగ్‌పై 5,800 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014, 2019 లోక్ సభ ఎన్నికల్లో సంగ్రూర్ నుంచి పోటీ చేసి భగవంత్ మాన్ సింగ్ వరసగా ఎంపీగా గెలుపొందారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో సిమ్రన్ జిత్ సింగ్ మాన్ గెలుపొందగా.. కాంగ్రెస్ అభ్యర్థి దల్వీర్ సింగ్ గోల్డీ, బీజేపీకి చెందిన కేవల్ ధిల్లాన్, అకాలీదళ్‌కు చెందిన కమల్‌దీప్ కౌర్ రాజోనా వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు.

ఇదిలా ఉంటే ఇటీవల మార్చిలో అధికార కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి పంజాబ్ లో ఆప్ అధికారాన్ని చేజిక్కించుకుంది. తాజాగా ఈ ఓటమి ఆప్ పై ప్రతికూల ప్రభావం చూపించే అవకాశం ఉంది. 2022 ఎన్నికల్లో సంగ్రూర్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని  లెహ్రా, దిర్బా, బర్నాలా, సునమ్, బదౌర్, మెహల్ కలాన్, మలేర్‌కోట్ల, ధురి, సంగ్రూర్ మొత్తం తొమ్మిది అసెంబ్లీ సెగ్మెంట్‌లను గెలుచుకున్న ఆమ్ ఆద్మీ పార్టీకి, సంగ్రూర్ లోక్ సభ నియోజక వర్గం కంచుకోట లాంటిది. అయితే చుట్టూ 9 మంది ఆప్ ఎమ్మెల్యేలు ఉన్నా.. అది కూడా సీఎం భగవంత్ మాన్ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గం అయినా.. ఆప్ అక్కడ గెలుపొందలేకపోయింది.

 

 

 

 

Exit mobile version